Andhra Pradesh: రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి బట్టబయలు.. లంచాల అడ్డాగా సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీసులు.. ఏసీబీ కొరడా

Andhra Pradesh ACB Raids on Sub Registrar Offices Unearth Corruption
  • రాష్ట్రవ్యాప్తంగా 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ మెరుపుదాడులు
  • అవినీతిపై వరుస ఫిర్యాదులతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ
  • భారీగా లెక్కల్లో చూపని నగదు స్వాధీనం.. రిజిస్ట్రేషన్లలో అక్రమాలు గుర్తింపు
  • ఏసీబీ అధికారులను చూసి పరారైన డాక్యుమెంట్ రైటర్లు, డబ్బు విసిరేసిన సిబ్బంది
  • నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు, పెండింగ్‌లో డాక్యుమెంట్లు వంటి లోపాలు బట్టబయలు
  • తనిఖీలు కొనసాగుతున్నాయని, బాధ్యులపై చర్యలు తప్పవన్న ఏసీబీ డీజీ
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రంగంలోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై బుధవారం ఏకకాలంలో మెరుపుదాడులు నిర్వహించింది. విజయనగరం నుంచి చిత్తూరు వరకు పలు జిల్లాల్లో చేపట్టిన ఈ ఆకస్మిక సోదాల్లో లెక్కల్లో చూపని భారీ నగదుతో పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అనేక అక్రమాలు, రికార్డుల్లో తేడాలను అధికారులు గుర్తించారు.

విశాఖపట్నంలోని పెదగంట్యాడ, మధురవాడ, జగదాంబ సెంటర్‌తో పాటు విజయనగరం జిల్లా భోగాపురం, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేట, ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, సత్యసాయి, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లోని ప్రధాన కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరిగాయి. భోగాపురం, జగదాంబ సెంటర్‌, ఇబ్రహీంపట్నం, ఒంగోలు, నెల్లూరు, నరసరావుపేట కార్యాలయాల్లో రూ.10 వేల నుంచి రూ.75 వేల వరకు అనధికారిక నగదు లభించిందని ఏసీబీ డీజీ అతుల్‌ సింగ్‌ తెలిపారు. ఈ సొమ్మును లంచాలు, అనధికారిక లావాదేవీల రూపంలో సేకరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

బట్టబయలైన అక్రమాలు
ప్రధానంగా 'ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌' విధానంలో ఎక్కువ అవకతవకలు జరుగుతున్నట్లు ఏసీబీ గుర్తించింది. కలెక్టర్‌ అనుమతి లేకుండా నిషేధిత జాబితాలోని భూములను రిజిస్టర్‌ చేయడం, లంచాలు ఇవ్వని వారి ఆస్తుల డాక్యుమెంట్లను పెండింగ్‌లో పెట్టడం, నాన్‌-జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్ల విక్రయాల రిజిస్టర్లలో అవకతవకలను అధికారులు కనుగొన్నారు. పలుచోట్ల ఏసీబీ అధికారులను చూడగానే డాక్యుమెంట్‌ రైటర్లు, ప్రైవేటు వ్యక్తులు పరారయ్యారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ, అన్నమయ్య జిల్లా రాజంపేటలో డాక్యుమెంట్‌ రైటర్లు తమ ల్యాప్‌టాప్‌లు, దస్తావేజులను అక్కడే వదిలేసి పరుగులు తీశారు.

డబ్బులు విసిరేసి, వాష్‌రూమ్‌లో దాచి..
ఒంగోలు కార్యాలయంలో అయితే ఏసీబీ బృందాలను చూసి కొందరు సిబ్బంది మొదటి అంతస్థు నుంచి కిందకు డబ్బు విసిరేయగా, మరికొందరు వాష్‌రూమ్‌లో దాచిపెట్టారు. అక్కడ సుమారు రూ.48 వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నంలో ఓ అధికారి బీరువాలో రూ.74,600, రేణిగుంటలో కార్యాలయ స్వీపర్‌ వద్ద రూ.6,500 పట్టుబడింది. పలు కార్యాలయాల్లో అనధికారికంగా ప్రైవేటు వ్యక్తులు పనిచేస్తున్నట్లు కూడా గుర్తించారు.

ఈ దాడులపై ఏసీబీ డీజీ అతుల్ సింగ్‌ మాట్లాడుతూ, "సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు చేపట్టాం. రికార్డుల పరిశీలనలో చాలా తేడాలు గుర్తించాం. పూర్తిస్థాయి విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు. అవినీతిపై ప్రజలు ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న రికార్డులను, నగదును ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
Andhra Pradesh
ACB Raids
Sub Registrar Offices
Corruption
Bribery
Illegal Registrations
Atul Singh
Visakhapatnam
Nandyala
Ongole

More Telugu News