ప్రభుత్వ బడి విద్యార్థులకు ఢిల్లీ సైన్స్ టూర్.. మంత్రి లోకేశ్ అభినందనలు

  • సర్కారు బడి విద్యార్థులకు సైన్స్ ఎక్స్‌పోజర్
  • జిల్లాకు ఇద్దరు చొప్పున 52 మంది విద్యార్థుల ఎంపిక
  • నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగనున్న పర్యటన
  • నేషనల్ సైన్స్ మ్యూజియం, ప్లానిటోరియం సందర్శన
  • ప్రముఖ సైన్స్ నిపుణులతో ముఖాముఖికి అవకాశం
  • విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది. శాస్త్ర సాంకేతిక రంగాలపై వారికి ప్రత్యక్ష అనుభవం అందించే లక్ష్యంతో 'సైన్స్‌ ఎక్స్‌పోజర్‌ టూర్'ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 52 మంది విద్యార్థులను ఢిల్లీకి విజ్ఞాన యాత్రకు పంపింది. ఏపీ సైన్స్‌ సిటీ, సమగ్రశిక్ష సంయుక్తంగా చేపట్టిన ఈ మూడు రోజుల పర్యటన గురువారం నుంచి ప్రారంభం కానుంది.

ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (స్టెమ్‌) రంగాల్లోని ప్రముఖ నిపుణులతో సమావేశమై వారి అనుభవాలను నేరుగా తెలుసుకుంటారు. మొదటి రోజు ఢిల్లీలోని రష్యన్‌ సెంటర్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ కల్చర్‌ను (రష్యన్‌ హౌస్‌) సందర్శిస్తారు. అక్కడ ఇండో-రష్యన్‌ అంతరిక్ష సహకారంపై జరిగే ప్రత్యేక సెషన్‌లో పాల్గొంటారు. స్పుత్నిక్‌పై లఘుచిత్ర ప్రదర్శనతో పాటు ఇండో-రష్యన్‌ స్పేస్‌ ఫ్రెండ్‌షిప్‌పై పోటీలు నిర్వహిస్తారు.

రెండో రోజున విద్యార్థులు నేషనల్‌ సైన్స్‌ మ్యూజియం సందర్శించి, రాకెట్రీ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. రాకెట్‌ డిజైన్‌, ప్రొపల్షన్‌, శాటిలైట్‌ లాంచ్‌ వంటి క్లిష్టమైన అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారు. అనంతరం మోడల్‌ రాకెట్‌ లాంచ్‌ సెషన్‌లో కూడా విద్యార్థులు భాగస్వాములవుతారు. ఇక పర్యటనలో చివరి రోజైన మూడో రోజున నెహ్రూ ప్లానిటోరియం, ప్రధానమంత్రి సంగ్రహాలయను సందర్శిస్తారు. భారత నాయకత్వం, సాంకేతిక అభివృద్ధి, శాస్త్రీయ దార్శనికత వంటి అంశాలను తెలుసుకుంటారు.

ఈ విజ్ఞాన యాత్రకు ఎంపికైన విద్యార్థులను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ అభినందించారు. "క్షేమంగా వెళ్లి విజ్ఞానంతో తిరిగి రావాలి" అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఎంపికైన విద్యార్థుల బృందం బుధవారమే గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది.


More Telugu News