Zohran Mamdani: మమ్దానీ విజయంలో తెరవెనుక పాత్ర ఆమెదే!

Zohran Mamdanis victory the role behind the scenes is hers
  • న్యూయార్క్ కొత్త మేయర్ మమ్‌దానీ.. తెరవెనుక సతీమణి రామా దువాజీ!
  • డేటింగ్ యాప్‌లో పరిచయం.. న్యూయార్క్ మేయర్ సతీమణిగా రామా!
  • న్యూయార్క్ మేయర్‌గా భారత సంతతి వ్యక్తి.. విజయంలో భార్య పాత్ర కీలకం
  • సిరియా మూలాలు, దుబాయ్‌లో బాల్యం.. న్యూయార్క్ ప్రథమ మహిళగా రామా!
న్యూయార్క్ నగర మేయర్‌గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్‌దానీ ఎన్నికై చరిత్ర సృష్టించారు. నగర అధికారిక నివాసం ‘గ్రేసీ మాన్షన్’లోకి అడుగుపెట్టనున్న ఆయన, అతి పిన్న వయస్కుడైన మేయర్‌గానూ రికార్డు నెలకొల్పారు. ఈ చారిత్రక విజయం తర్వాత ఆయన సతీమణి రామా సవాఫ్ దువాజీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఆమె పెద్దగా కనిపించకపోయినా, తెరవెనుక ఆమె పోషించిన పాత్ర కీలకమని అమెరికన్ మీడియా కథనాలు ప్రచురిస్తున్నాయి.

సిరియన్-అమెరికన్ సంతతికి చెందిన రామా దువాజీ వృత్తిరీత్యా చిత్రకారిణి, యానిమేటర్. 1997లో టెక్సాస్‌లో జన్మించిన ఆమె, తొమ్మిదేళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి దుబాయ్‌కు వెళ్లారు. విభిన్న సంస్కృతులు కలిగిన దుబాయ్‌లో పెరిగిన ఆమె, ఉన్నత విద్య కోసం న్యూయార్క్ వచ్చి స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. తన చిత్రాల ద్వారా మహిళా సాధికారత, పాలస్తీనియన్ల సమస్యలను రామా బలంగా వినిపిస్తుంటారు. ప్రముఖ పత్రికల్లో ఆమె చిత్రాలు ప్రచురితమయ్యాయి.

ఈ క్రమంలో 2021లో ఓ డేటింగ్ యాప్ ద్వారా జోహ్రాన్ మమ్‌దానీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి, గతేడాది డిసెంబర్‌లో దుబాయ్‌లో వీరి వివాహం జరిగింది. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూయార్క్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని, జులైలో ఉగాండాలో ప్రత్యేక వేడుకను నిర్వహించారు.

తాజాగా తన విజయం అనంతరం మమ్‌దానీ మాట్లాడుతూ.. తన గెలుపులో తల్లిదండ్రులతో పాటు భార్య పాత్ర ఎంతో ఉందని స్పష్టం చేశారు. "ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటారు. నా విషయంలో ఈ క్షణం, ప్రతిక్షణం నాకు తోడుగా నిలిచే వ్యక్తి నా భార్యే" అంటూ ఆయన తన సతీమణికి కృతజ్ఞతలు తెలిపారు. విభిన్న సంస్కృతుల నేపథ్యం కలిగిన రామా దువాజీ ఇప్పుడు న్యూయార్క్ నగర ప్రథమ మహిళగా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. 
Zohran Mamdani
Rama Duwaji
New York Mayor
Indian American
Syrian American
Gracie Mansion
New York City
Uganda
Dubai
Artist

More Telugu News