Revanth Reddy: ముస్లింలపై వ్యాఖ్య.. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ డిమాండ్

Revanth Reddy demands apology for Muslim remarks
  • కాంగ్రెస్ లేకుంటే ముస్లింలు లేరని రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని ఖండించిన ఎస్ఐఓ
  • రేవంత్ రెడ్డి ప్రకటనను ఖండిస్తూ ఎస్ఐఓ ప్రకటన
  • బాధ్యతారాహిత్యమే కాకుండా ముస్లిం సమాజ ఆత్మగౌరవానికి అవమానకరమైనవి అన్న ఎస్ఐఓ
ముస్లింలు ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఓ) తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలకు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ లేకుంటే ముస్లింలు లేరనే విధంగా మాట్లాడి అవమానించారని, ఈ వ్యాఖ్యలు విభజన ధోరణిలో ఉన్నాయని ఎస్ఐఓ ఆగ్రహం వ్యక్తం చేసింది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఎస్ఐఓ తెలంగాణ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ సమాజం యొక్క బల, విలువలైనా రాజకీయ శక్తులపై ఆధారపడి ఉండవని, ఆ సమాజం యొక్క విలువలు, సమగ్రతపై ఆధారపడి ఉంటాయని తాము విశ్వసిస్తున్నామని ఎస్ఐఓ ఆ ప్రకటనలో పేర్కొంది. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమే కాకుండా, ముస్లిం సమాజ ఆత్మగౌరవానికి అవమానకరమని తెలిపింది.

ఈ వ్యాఖ్యలు పెత్తందారీ, ఓటు బ్యాంకు రాజకీయ మనస్తత్వాన్ని బహిర్గతం చేస్తున్నాయని విమర్శించింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక సమాజం గురించి అలా మాట్లాడటం ప్రజాస్వామ్య, నైతిక విలువలు క్షీణించినట్లు సూచిస్తుందని తెలిపింది. ముస్లిం సమాజంపై చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పాలని ఎస్ఐఓ డిమాండ్ చేసింది. ఈ వ్యాఖ్యలు స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికలకు అవరోధం కలిగిస్తాయని, ఇలాంటి రెచ్చగొట్టే, అప్రజాస్వామిక ప్రకటనలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించాలని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ కోరింది.
Revanth Reddy
Telangana
Students Islamic Organisation
SIO
Muslims
Congress
Jubilee Hills

More Telugu News