Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన నలుగురి దుర్మరణం

Karnataka Road Accident Four Dead from Telangana
   
కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కర్ణాటకలోని హల్లిఖేడ్ వద్ద బుధవారం ఓ వ్యాను, కారు బలంగా ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతులంతా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

జగన్నాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40) మరికొందరితో కలిసి కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గాణగాపూర్‌ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లారు. దైవ దర్శనం ముగించుకుని కారులో తిరిగి స్వగ్రామానికి పయనమయ్యారు. ఈ క్రమంలో హల్లిఖేడ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న వ్యాను వేగంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాద తీవ్రతకు నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, కారులోని మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు యాత్రకు వెళ్లి మృత్యువాత పడటంతో జగన్నాథ్‌పూర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Karnataka Road Accident
Telangana
Sangareddy
Narayanakhed
Jagannathpur
Gangapur Dattatreya Temple
Road Accident
India News
Accident Death
Karnataka

More Telugu News