Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ 30 వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది: రేవంత్ రెడ్డి జోస్యం

Revanth Reddy Predicts Congress Victory in Jubilee Hills
  • నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే 4 వేల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తానని హామీ
  • గతంలో పీజేఆర్ చనిపోయినప్పుడు కేసీఆర్ అభ్యర్థిని నిలబెట్టారన్న రేవంత్ రెడ్డి
  • తనను గెంటేశారని కవిత రాష్ట్రమంతా తిరిగి గోడు చెప్పుకుంటోందన్న ముఖ్యమంత్రి
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 30 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించబోతోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీఆర్ హిల్స్ నుండి హబీబ్ ఫాతిమా నగర్ వరకు జరిగిన రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే 4 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

మాగంటి గోపీనాథ్ మరణించారని, ఆయన భార్యను ఇప్పుడు బరిలోకి దింపి గెలిపించాలని బీఆర్ఎస్ కోరుతోందని, అయితే గతంలో పీజేఆర్ మరణించినప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ పోటీకి నిలబెట్టారని గుర్తు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే వచ్చే ప్రతి ఉప ఎన్నికలోనూ కేసీఆర్ అభ్యర్థిని నిలబెట్టారని విమర్శించారు.

కేటీఆర్‌కు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. సొంత ఇంటి నుంచి తనను గెంటేశారని కవిత రాష్ట్రమంతా తిరుగుతూ తన గోడు వెళ్లబోసుకుంటున్నారని ముఖ్యమంత్రి అన్నారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని కేటీఆర్ ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ హయాంలో ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చారా అని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 14,159 రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. బీఆర్ఎస్ గెలిస్తే ప్రస్తుతం అందుతున్న పథకాలు కూడా ఆగిపోతాయని హెచ్చరించారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధం అని ఆరోపించారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో కేసీఆర్, కేటీఆర్‌లను జైలుకు పంపిస్తామని చెప్పారని, సీబీఐకి అప్పగించి మూడు నెలలైనా కేసు నమోదు చేయలేదని విమర్శించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి కోరితే స్పందన లేదని అన్నారు.
Revanth Reddy
Telangana
Jubilee Hills
Congress Party
Naveen Yadav
BRS Party
KTR
Telangana Elections

More Telugu News