Nara Lokesh: 70వ ప్రజా దర్బార్... 4 వేల మందిని కలిసిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Meets 4000 People at 70th Praja Darbar
  • మంత్రి నారా లోకేష్ 70వ రోజు ప్రజాదర్బార్ నిర్వహణ
  • నాలుగు గంటల్లో సుమారు 4 వేల మందిని కలిసిన మంత్రి నారా లోకేశ్
  • రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చి సమస్యలు తెలిపిన ప్రజలు
  • వైసీపీ పాలనలో అన్యాయం జరిగిందంటూ పలువురి ఆవేదన
  • ఉద్యోగ, కార్మిక సంఘాల నుంచి పలు విజ్ఞప్తులు
  • అందరికీ అండగా ఉంటానని హామీ
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమం 70వ రోజుకు చేరుకుంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం మరోసారి జనసంద్రంగా మారింది. మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు. సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ దాదాపు 4 వేల మందికి పైగా ప్రజలను స్వయంగా కలిసి వారి సమస్యలను ఓపికగా విన్నారు.

ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరిస్తూ వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. సమస్య తీవ్రతను బట్టి అక్కడికక్కడే అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించే బాధ్యత తమదని, అందరికీ అండగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన వారిలో అధికశాతం మంది గత వైసీపీ ప్రభుత్వంలో తాము ఎదుర్కొన్న కష్టాలను, అన్యాయాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

వైసీపీ పాలనలో అన్యాయం జరిగిందంటూ ఫిర్యాదులు

గత ప్రభుత్వంలో తమపై అక్రమ కేసులు బనాయించారని, ఆస్తులు లాక్కున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ప్రోద్బలంతో తన భూమిని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త దనపాన హరికృష్ణ మంత్రి లోకేశ్ కు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన మెరిగల రవిబాబు, తన వారసత్వ భూమిని వైసీపీ కార్యకర్త కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, పోలీసులు స్పందించడం లేదని వాపోయారు. టీడీపీ సానుభూతిపరుడిననే కారణంతో అతిథి అధ్యాపకుడి ఉద్యోగం నుంచి తొలగించారని కర్నూలు జిల్లాకు చెందిన ఉలిద్ర రవి మంత్రికి తన గోడును వెళ్లబోసుకున్నారు. ఈ ఫిర్యాదులపై విచారణ జరిపి తగిన న్యాయం చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

ఉద్యోగ, కార్మిక సంఘాల వినతులు

రాష్ట్రవ్యాప్తంగా పలు ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న హెల్త్ అసిస్టెంట్ (మేల్) పోస్టులను భర్తీ చేయాలని అన్ ఎంప్లాయిస్ పారా మెడికల్ హెల్త్ అసిస్టెంట్ అసోసియేషన్ కోరింది. ఏపీ జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కమ్స్‌లో పనిచేస్తున్న 23,500 మంది కాంట్రాక్టు కార్మికుల సేవలను క్రమబద్ధీకరించి, వేతన సవరణ చేయాలని ఆంధ్ర రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

స్థానిక సమస్యలపైనా వెల్లువెత్తిన విజ్ఞప్తులు

నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు గూడెంలలో కొత్త పాఠశాలలు మంజూరు చేయాలని గిరిజన సంఘం ప్రతినిధులు కోరారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని స్థానికులు విన్నవించారు. విజయవాడ గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గరిమెళ్ల అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తనకు సీఎం సహాయ నిధి ద్వారా వైద్యసాయం అందించాలని చిత్తూరుకు చెందిన ప్రకాశ్ బాబు కోరారు. వచ్చిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
Nara Lokesh
Praja Darbar
Andhra Pradesh
TDP
YS Jagan Mohan Reddy
Grievances
Public Meeting
AP Genco
Contract Workers
Unemployed Paramedical Health Assistants

More Telugu News