Gopichand Hinduja: హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ హిందూజా లండన్ లో కన్నుమూత

Gopichand Hinduja Hinduja Group Chairman Dies in London
  • 85 ఏళ్ల వయసులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గోపీచంద్ తుదిశ్వాస
  • బ్రిటన్‌లో అత్యంత సంపన్న కుటుంబంగా గుర్తింపు
  • వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచ స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర
  • గతంలో కుటుంబంలో ఆస్తుల వివాదం కోర్టుకెక్కిన వైనం
ప్రముఖ పారిశ్రామికవేత్త, హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ హిందూజా (85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నలుగురు హిందూజా సోదరులలో గోపీచంద్ రెండోవారు. పెద్ద సోదరుడు శ్రీచంద్ హిందూజా 2023లో మరణించిన విషయం తెలిసిందే.

వ్యాపార వర్గాల్లో 'జీపీ'గా సుపరిచితుడైన గోపీచంద్, 1950లో తమ కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టారు. అప్పట్లో ఇండో-మిడిల్ ఈస్ట్ మధ్య ఒక ట్రేడింగ్ కంపెనీగా ఉన్న హిందూజా గ్రూప్‌ను తన సోదరులతో కలిసి బహుళజాతి వ్యాపార సామ్రాజ్యంగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం హిందూజా గ్రూప్ ఆటోమోటివ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్, మీడియా వంటి 11 రంగాల్లో విస్తరించి ఉంది. అశోక్ లేలాండ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్ఎక్స్‌టీ డిజిటల్ వంటివి ఈ గ్రూప్‌లోని ప్రముఖ బ్రాండ్లు.

ఇటీవలే 'సండే టైమ్స్ రిచ్ లిస్ట్' 2025 ఎడిషన్‌లో గోపీచంద్ హిందూజా కుటుంబాన్ని బ్రిటన్‌లో అత్యంత సంపన్న కుటుంబంగా ప్రకటించింది. వారి నికర ఆస్తి విలువ 32.3 బిలియన్ పౌండ్లుగా అంచనా వేసింది. అయితే, 2021లో హిందూజా కుటుంబంలో ఆస్తుల వివాదం లండన్ కోర్టు వరకు చేరింది. తమను నిధులు, నిర్ణయాల ప్రక్రియ నుంచి అంకుల్స్ దూరం పెడుతున్నారని శ్రీచంద్ హిందూజా కుమార్తెలు వినూ, షాను ఆరోపించారు. దీనికి గోపీచంద్, ప్రకాశ్, అశోక్ సోదరులు స్పందిస్తూ.. "అంతా అందరిదీ, ఏదీ ఎవరిదీ కాదు" అని 2013లో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావించారు. ఈ వివాదం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ముంబైలోని జై హింద్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన గోపీచంద్, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్, రిచ్‌మండ్ కాలేజీల నుంచి గౌరవ డాక్టరేట్‌లు అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు పారిశ్రామికవేత్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Gopichand Hinduja
Hinduja Group
Srichand Hinduja
Ashok Leyland
IndusInd Bank
London
Business
Industrialist
Hinduja Family Dispute
UK Richest Family

More Telugu News