NPCI: 'డిజిటల్ అరెస్ట్' స్కాంలపై ఎన్పీసీఐ హెచ్చరిక

NPCI Warns Against Digital Arrest Scams
  • డిజిటల్ అరెస్ట్' పేరుతో కొత్త తరహా మోసాలు
  • పోలీసులు, సీబీఐ అధికారులమంటూ బెదిరింపులు
  • వీడియో కాల్స్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ సెటప్‌లు
  • డబ్బులు బదిలీ చేయాలంటూ బాధితులపై ఒత్తిడి
  • అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు NPCI సూచన
  • సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని వెల్లడి
దేశవ్యాప్తంగా కొత్త తరహా సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, 'డిజిటల్ అరెస్ట్' పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ-NPCI) మంగళవారం కీలక సూచనలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు పోలీసు, సీబీఐ, కస్టమ్స్, ఆదాయ పన్ను శాఖ అధికారులమంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు దోచుకుంటున్నారని హెచ్చరించింది.

మోసం చేసే విధానం ఇదే...!

ఈ 'డిజిటల్ అరెస్ట్' మోసంలో నేరగాళ్లు మొదట సాధారణ ఫోన్ కాల్ చేసి, ఆ తర్వాత బాధితులను నమ్మించడానికి వీడియో కాల్స్‌కు మారతారు. తాము ప్రభుత్వ అధికారులమని చెప్పి, బాధితులపై లేదా వారి కుటుంబ సభ్యులపై మనీ లాండరింగ్, డ్రగ్స్ రవాణా లేదా పన్ను ఎగవేత వంటి తీవ్రమైన కేసులు నమోదయ్యాయని బెదిరిస్తారు.

తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తూ బాధితుల్లో భయాన్ని సృష్టిస్తారు. వీడియో కాల్స్ సమయంలో నకిలీ యూనిఫాంలు, ప్రభుత్వ లోగోలు, పోలీస్ స్టేషన్ వంటి నకిలీ నేపథ్యాలను సృష్టించి బాధితులను పూర్తిగా నమ్మిస్తారు. అంతటితో ఆగకుండా, తాము చెప్పేది నిజమేనని భ్రమింపజేసేందుకు వెనుక వైపు అధికారిక కార్యాలయాల్లో వినిపించే శబ్దాలు వచ్చేలా చూసుకుంటారు.

కేసు విచారణ పూర్తయ్యే వరకు కొంత మొత్తాన్ని తమ ఖాతాకు బదిలీ చేయాలని బాధితులపై ఒత్తిడి తెస్తారు. "మీ పేరును కేసు నుంచి తొలగించడానికి", "విచారణకు సహకరించడానికి" లేదా "రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్" వంటి మాటలు చెప్పి మోసపూరితంగా డబ్బులు బదిలీ చేయించుకుంటారు.

ప్రజలకు NPCI సూచనలు

ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే ఏమాత్రం ఆందోళన చెందవద్దని ఎన్పీసీఐ సూచించింది. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఎప్పుడూ ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ జరపవని, డబ్బులు డిమాండ్ చేయవని స్పష్టం చేసింది. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఇలాంటి ఆరోపణలు చేస్తే, వెంటనే కాల్ కట్ చేసి వారి వివరాలను ధృవీకరించుకోవాలని తెలిపింది.

అనుమానాస్పద నంబర్ల నుంచి కాల్స్ వస్తే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి గానీ, లేదా టెలికమ్యూనికేషన్ శాఖకు చెందిన 'సంచార్ సాథి' పోర్టల్‌లో గానీ ఫిర్యాదు చేయాలని సూచించింది. మోసగాళ్లతో జరిపిన సంభాషణలకు సంబంధించిన మెసేజ్‌లు, స్క్రీన్‌షాట్‌లను భద్రపరుచుకుంటే, ఫిర్యాదు చేసేటప్పుడు అధికారులకు సాక్ష్యాలుగా ఉపయోగపడతాయని ఎన్ పీసీఐ తన ప్రకటనలో వివరించింది.
NPCI
National Payments Corporation of India
digital arrest scam
cyber crime
cyber fraud
online fraud
financial fraud
sanchar saathi portal
cyber crime helpline 1930
money laundering

More Telugu News