porn ban: పోర్న్ బ్యాన్ చేయాలంటూ పిటిషన్.. నేపాల్ లో ఏం జరిగిందో చూశారు కదా? అంటూ సుప్రీంకోర్టు ప్రశ్న

BR Gavai Supreme Court Questions Porn Ban Petition Cites Nepal Incident
  • ఇంటర్నెట్ లో అశ్లీల కంటెంట్ ను నిషేధించాలన్న పిటిషనర్
  • దేశంలో కోట్లాది పోర్న్ సైట్లు అందుబాటులో ఉన్నాయని వివరణ
  • 20 కోట్ల వీడియోలు ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టారని వెల్లడి
  • నేపాల్ జెన్ జెడ్ ఉద్యమాన్ని గుర్తు చేసిన సీజేఐ బెంచ్
ఇంటర్నెట్ లో మితిమీరిపోతున్న అశ్లీల కంటెంట్ పై నిషేధం విధించాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న ఈ అశ్లీల వీడియోలు, క్లిప్పులు ఎదిగే పిల్లల మనసులను కలుషితం చేస్తాయని, తీవ్ర దుష్పరిణామాలకు కారణమవుతాయని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్ లో ఇటీవల జరిగిన జెన్ జెడ్ ఆందోళనలను ప్రస్తావించింది.

ఇంటర్నెట్ లోని పలు సైట్లపై నిషేధం విధించడం వల్ల నేపాల్ లో చోటుచేసుకున్న పరిణామాలు చూశారు కదా అంటూ పిటిషనర్ ను ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడు ఈ పిటిషన్ ను విచారించలేమని చెబుతూ 4 వారాలకు వాయిదా వేసింది. ఈ నెల 23న సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. ఈ పిటిషన్ పై విచారణకు ఆయన సుముఖంగా లేరని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

పిటిషనర్ ఇంకా ఏమన్నారంటే..
డిజిటలైజేషన్ తర్వాత దేశంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిందని, చిన్నాపెద్దా తేడా లేకుండా, అక్షరాస్యతతో సంబంధంలేకుండా అందరూ నెట్ వాడుతున్నారని పిటిషనర్ చెప్పారు. కోవిడ్ తర్వాత చిన్నారుల్లో కూడా మొబైల్, ట్యాబ్, ల్యాప్ టాప్ వాడకం పెరిగిందని గుర్తుచేశారు. ఈ క్రమంలో ఇంటర్నెట్ లో అశ్లీల కంటెంట్ ను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. పోర్న్ కట్టడికి సంబంధించి జాతీయ స్థాయిలో ఓ పాలసీ తీసుకురావాలంటూ కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు.

సైట్లను నిషేధించడం లేదేం..
ఇంటర్నెట్లో పోర్న్ ను ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రోత్సహించే సైట్లు కోట్ల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయని పిటిషనర్ చెప్పారు. ఈ వెబ్ సైట్లకు కేంద్రం ఎందుకు అనుమతిస్తోందని ప్రశ్నించారు. ఒక్క మన దేశంలోనే 20 కోట్ల అశ్లీల వీడియోలు, వీడియో క్లిప్పులు ఆన్ లైన్ లో అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. డిజిటలైజేషన్ తర్వాత ఆన్ లైన్ లో అశ్లీల కంటెంట్ కేవలం ఒక్క క్లిక్ తో అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు.

ఆన్ లైన్ లో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న ఈ అశ్లీల కంటెంట్ వల్ల ఎదిగే పిల్లల మనసులు కలుషితమవుతాయని, ఇది దుష్పరిణామాలకు దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని 69 ఏ ఆర్టికల్ ప్రకారం అశ్లీల కంటెంట్ ను ప్రోత్సహించే వెబ్ సైట్లపై నిషేధం విధించే అవకాశం ఉన్నప్పటికీ కేంద్రం ఈ దిశగా చర్యలు తీసుకోవడంలేదని పిటిషనర్ విమర్శించారు.
porn ban
Supreme Court
BR Gavai
Nepal
internet ban
pornography
digital content
IT Act
online content regulation
child safety

More Telugu News