Anchor Shyamala: కర్నూలు డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన యాంకర్ శ్యామల

Anchor Shyamala Attends Inquiry in Kurnool DSP Office
  • కర్నూలు బస్సు ప్రమాదంపై సోషల్ మీడియాలో పోస్టులు
  • వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలకు పోలీసుల నోటీసులు
  • కర్నూలు డీఎస్పీ కార్యాలయంలో రెండు గంటల పాటు విచారణ
  • పార్టీ ఆదేశాలతోనే మాట్లాడానని పోలీసులకు చెప్పినట్లు సమాచారం
  • విచారణ తర్వాత మీడియా ముందు మరోసారి అవే ఆరోపణలు
  • శ్యామలతో పాటు మొత్తం 27 మందిపై కేసు నమోదు
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల సోమవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. కర్నూలు డీఎస్పీ కార్యాలయంలో ఆమెను సుమారు రెండు గంటల పాటు విచారించారు. ఈ కేసులో శ్యామలతో పాటు మరో 26 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే... ఇటీవల జరిగిన బస్సు ప్రమాదానికి బెల్టు షాపుల్లో విక్రయిస్తున్న నకిలీ మద్యమే కారణమంటూ యాంకర్ శ్యామల సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. దీనిపై కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఆమెతో సహా మొత్తం 27 మందిపై కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం వైసీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి శ్యామల డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు.

డీఎస్పీ బాబు ప్రసాద్.. శ్యామలను సుమారు రెండు గంటల పాటు విచారించి, దాదాపు 65 ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ప్రమాదానికి మద్యం కారణమని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటని పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 

విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన శ్యామల, పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. అయితే, ఇదే సమయంలో ఆమె తన ఆరోపణలను మరోసారి పునరుద్ఘాటించారు. "బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపలేదా? బైకర్లు బెల్టు షాపులో మద్యం తాగలేదా?" అంటూ మీడియా ముందు మళ్లీ అవే ప్రశ్నలను లేవనెత్తడం గమనార్హం.
Anchor Shyamala
Shyamala
Kurnool
Road Accident
Fake Liquor
Belt Shops
YCP
DSP Office
Police Investigation
Social Media

More Telugu News