Sajjala Ramakrishna Reddy: ఈ కక్ష సాధింపు నారా వారి కొత్త చట్టంలా మారింది: సజ్జల

Sajjala Ramakrishna Reddy Slams Nara Government Vendetta Politics
  • కూటమి ప్రభుత్వం ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు పాల్పడుతోందన్న సజ్జల
  • జోగి రమేశ్ అరెస్ట్‌తో ప్రభుత్వ వికృత చేష్టలు పరాకాష్టకు చేరాయని మండిపాటు
  • నకిలీ మద్యం కేసులో టీడీపీ నేత పాత్రపై ఆధారాలున్నాయని వ్యాఖ్య
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 'ప్రభుత్వం' అనే పదానికే అర్థం మారిపోయిందని, ప్రభుత్వమే వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతోందని వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం వ్యవస్థలను గాలికి వదిలేసి ప్రత్యర్థులపై కక్ష సాధింపులకు దిగుతోందని ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్‌తో వీరి వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయని ఆయన విమర్శించారు.

నకిలీ మద్యం కేసు వ్యవహారంపై సజ్జల మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో టీడీపీ నేత జయచంద్రారెడ్డి పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని, అందుకు తగిన ఆధారాలున్నాయని తెలిపారు. జయచంద్రారెడ్డి మనుషులే నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడిపి, వారి షాపుల్లోనే అమ్ముతున్నారని ఆరోపించారు. ఆయనకు ఆఫ్రికాలో వ్యాపారాలు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లోనూ స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. ఇంత స్పష్టంగా ఆధారాలున్నా, వాస్తవాలను పక్కనపెట్టి వైసీపీ నేతలపై నెపం మోపడానికి జోగి రమేశ్‌ను అసంబద్ధంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ గ్రూపుల గొడవల్లో జరిగిన జంట హత్యల కేసును తమ పార్టీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై పెట్టారని అన్నారు. తునిలో మైనర్ బాలికపై టీడీపీ నేత అత్యాచారం చేస్తే, సంబంధం లేని వైసీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలిచి వేధిస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా కేసులో గంజాయి పెట్టి అరెస్ట్ చేస్తే హైకోర్టు కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని గుర్తుచేశారు.

రాష్ట్రంలో లోకేశ్ 'రెడ్ బుక్' పాలన నడుస్తోందని, ఆయన నేతృత్వంలో విధ్వంసకర పాలన సాగిస్తున్నారని సజ్జల విమర్శించారు. "ప్రతిపక్షం గొంతు వినిపించకూడదనే ఉద్దేశంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కేవలం వాంగ్మూలాల ఆధారంగా వైసీపీ నేతలను అరెస్ట్ చేసి జైళ్లలో పెడుతున్నారు. కక్ష సాధింపే 'నారా వారి కొత్త చట్టం'లా మారింది" అని ఆయన వ్యాఖ్యానించారు. జోగి రమేశ్ ఇంట్లో పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు దొరికాయంటూ చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని, నేరం చేయకపోయినా తమ నేతలు శిక్షకు గురవుతున్నారని అన్నారు. ఇన్ని జరుగుతున్నా రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మకాలు మాత్రం ఆగడం లేదని సజ్జల విమర్శించారు.
Sajjala Ramakrishna Reddy
YS Jagan
TDP
Andhra Pradesh Politics
Jogi Ramesh Arrest
Fake Liquor Case
Nara Lokesh
Red Book
Political Vendetta
Andhra Pradesh Government

More Telugu News