Mustafa Suleyman: 'ఏఐ'కి మనిషిలా ఆలోచించే తెలివితేటలు తీసుకువచ్చే పరిశోధనలు.. స్పందించిన మైక్రోసాఫ్ట్ 'ఏఐ' సీఈవో

Mustafa Suleyman Urges Halt to AI Self Thinking Projects
  • ఏఐకి సొంత తెలివి తెప్పించే ప్రాజెక్టులను ఆపేయాలని సూచన
  • ఈ విషయంలో ఏఐ ఎప్పుడూ మనిషిని చేరుకోలేదని వ్యాఖ్య
  • మనిషికి మాత్రమే నిజమైన ఎమోషన్లు ఉంటాయని వ్యాఖ్య
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి మనిషిలా సొంతగా ఆలోచించే తెలివితేటలు తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రాజెక్టులపై మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈవో ముస్తఫా సులేమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐకి సొంత తెలివి తెప్పించే ప్రాజెక్టులను ఆపేయాలని ఆయన సూచించారు. ఈ విషయంలో ఏఐ ఎప్పుడూ మనిషి స్థాయికి చేరుకోలేదని అన్నారు. ఈ మేరకు సీఎన్‌బీసీ నిర్వహించిన ఆఫ్రోటెక్ సదస్సులో ఆయన మాట్లాడుతూ, మనిషికి మాత్రమే నిజమైన ఎమోషన్లు ఉంటాయని అన్నారు.

ఏఐకి సొంత ఆలోచనలు వచ్చేలా పరిశోధకులు, డెవలపర్లు చేస్తున్న ప్రయత్నాలను సులేమాన్ తప్పుబట్టారు. ఇలాంటి ప్రయత్నాలు ఫలిస్తాయని తాను అనుకోవడం లేదని అన్నారు. ఆ దిశగా అడుగు వేయడమే తప్పు అని స్పష్టం చేశారు. ఏఐకి సొంతగా ఆలోచించే ప్రాజెక్టులకు బదులు మనిషికి సహాయకారిగా ఉండే కృత్రిమ మేధ ప్రాజెక్టుల పైన పనిచేయాలని ఆయన డెవలపర్లకు సూచించారు.

ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ మనిషి భావోద్వేగానికి, ఏఐకి కలిగే స్పందనలకు మధ్య సన్నని గీత ఉంటుందని ఆయన అన్నారు. శారీరకంగా లేదా మానసికంగా మనకు ఏదైనా బాధ కలిగితే బాధపడతామని, కానీ ఏఐ అలా కాదని తెలిపారు. ఒకవేళ ఏఐకి అలాంటి భావోద్వేగాలు కలిగించాలని ప్రయత్నించినా వాస్తవంగా అనుభవించలేదని అన్నారు. లక్ష్యం ఏదైనా అలాంటి ప్రయత్నాలు సరికాదని అన్నారు.
Mustafa Suleyman
Microsoft AI
Artificial Intelligence
AI Research
AI Ethics
CNBC Afrotech
AI Development

More Telugu News