Pawan Kalyan: పులికాట్ సరస్సుకు శీతాకాలం అతిథుల రాక మొదలైంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan Focuses on Developing Pulicat Lake Eco Tourism
  • పులికాట్‌ను గొప్ప ఎకో టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న పవన్ 
  • ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా మార్చేందుకు చర్యలు
  • శీతాకాల అతిథుల రాకతో పులికాట్ సరస్సులో సందడి
  • ఫోటోగ్రఫీ, బర్డ్ సీయింగ్ వంటి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం
  • తుపాను వేళ పక్షుల సంరక్షణకు అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు
  • జీవ వైవిధ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమన్న పవన్ కల్యాణ్
తిరుపతి జిల్లా పులికాట్ సరస్సును అంతర్జాతీయ స్థాయిలో ఓ గొప్ప పర్యావరణ పర్యాటక (ఎకో టూరిజం) కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. పులికాట్ సరస్సుకు శీతాకాలం అతిథుల రాక మొదలైందని తెలిపారు. శీతాకాలంలో వలస వచ్చే ఫ్లెమింగో పక్షులకు పులికాట్‌ను శాశ్వత నివాస స్థావరంగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ ప్రాంత జీవ వైవిధ్యాన్ని కాపాడుతూనే, పర్యాటకంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రతి ఏటా శీతాకాలంలో సైబీరియా నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఫ్లెమింగోలు (రాజహంసలు) పులికాట్‌కు వస్తాయని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. అక్టోబర్‌లో వచ్చి మార్చిలో తిరిగి వెళ్లే ఈ పక్షుల రాకను పురస్కరించుకుని ఏటా 'ఫ్లెమింగో ఫెస్టివల్' ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి 7 నుంచి 8 లక్షల మంది పక్షి ప్రేమికులు హాజరవుతారని తెలిపారు. అయితే, ఇక్కడి అనుకూల వాతావరణం కారణంగా ఇటీవల ఫ్లెమింగోలు ఏడాది పొడవునా ఇక్కడే ఉంటున్నాయని, ఇది శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు.

ఎకో టూరిజాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా, ఫ్లెమింగోలు ఇక్కడే స్థిరంగా ఉండేందుకు అటవీ శాఖ ద్వారా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వాటి ఆహారం, భద్రత, విశ్రాంతికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నామని, ఈ చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయని అన్నారు. కేవలం మూడు రోజుల పండుగకే పరిమితం కాకుండా, ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షించేందుకు ఫోటోగ్రఫీ, బర్డ్ సీయింగ్, ఎకో క్లబ్ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు.

ఇటీవల వచ్చిన 'మొంథా' తుపాను సమయంలోనూ ఫ్లెమింగోల ఆవాసాలకు ఇబ్బంది కలగకుండా అటవీ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. రాబోయే మూడు నెలల పాటు పక్షుల సంరక్షణపై మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో పులికాట్‌ను ఫ్లెమింగోల శాశ్వత చిరునామాగా మార్చడంతో పాటు, దేశంలోనే ఒక ముఖ్యమైన పర్యావరణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Pawan Kalyan
Pulicat Lake
Flamingo Festival
Eco Tourism
Andhra Pradesh Tourism
Migratory Birds
Wildlife Conservation
Forest Department
Bird Watching

More Telugu News