Chevella Accident: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి

Chevella Accident 24 Dead as Lorry Overturns on RTC Bus
  • రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
  • ఆర్టీసీ బస్సును ఢీకొని, మీద పడిన కంకర లారీ
  • ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి
  • మృతుల్లో బస్సు, లారీ డ్రైవర్లతో పాటు మహిళలు, చిన్నారి
  • ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు, ముగ్గురి పరిస్థితి విషమం
  • బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన లారీ, బస్సుపై బోల్తా పడింది. లారీలోని కంకర మొత్తం ప్రయాణికులపై పడటంతో చాలామంది దాని కింద చిక్కుకుపోయారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి, తిరిగి హైదరాబాద్‌లోని కార్యాలయాలు, కళాశాలలకు వెళ్తున్న వారే వీరిలో అధికంగా ఉన్నారు. ప్రయాణికుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలం హృదయవిదారకంగా మారింది.

మృతుల్లో బస్సు డ్రైవర్ దస్తగిరి, లారీ డ్రైవర్ సహా 12 మంది మహిళలు,  ఒక చిన్నారి ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మూడు జేసీబీల సహాయంతో కంకరను తొలగించి, అందులో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. ఇప్పటివరకు కండక్టర్ రాధ సహా 15 మందిని సురక్షితంగా కాపాడారు. ఈ క్రమంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ కూడా గాయపడ్డారు.

క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్షతగాత్రులకు అత్యున్నత వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. మృతులందరి పోస్టుమార్టం ఉస్మానియా ఆసుపత్రిలో ఒకేచోట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
Chevella Accident
RTC Bus Accident
Hyderabad
Tandur
Road Accident
Telangana
Revanth Reddy
Mirjaguda
National Highway
Bus Accident

More Telugu News