Surisetti Vasu: విశాఖలో విషాదం.. ఏడు నెలల గర్భిణి.. కడుపులోని బిడ్డ సహా దంపతుల బలవన్మరణం

Surisetti Vasu and Wife Found Dead in Visakhapatnam Pregnant Woman Dies
  • విశాఖ అక్కయ్యపాలెంలో ఘటన యువ దంపతుల ఆత్మహత్య
  • ఫ్యాన్‌కు ఉరేసుకున్న భర్త.. మంచంపై విగతజీవిగా భార్య
  • కడుపులోని బిడ్డను కాపాడే ప్రయత్నం విఫలం
  • గర్భంలోని ఆడశిశువు కూడా మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారణ
విశాఖ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అన్యోన్యంగా జీవిస్తున్న యువ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అక్కయ్యపాలెంలో ఈ ఘటన వెలుగుచూసింది. మృతుల్లో ఏడు నెలల గర్భిణి ఉండటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్కయ్యపాలెం, దాలిరాజు సూపర్‌మార్కెట్‌ సమీపంలో సూరిశెట్టి వాసు తన భార్య అనిత, తల్లితో కలిసి నివసిస్తున్నాడు. ఏడాది క్రితం వీరికి వివాహం జరిగింది. ప్రస్తుతం అనిత ఏడు నెలల గర్భిణి. నిన్న ఉదయం వాసు తల్లి ఒక ఫంక్షన్‌కు వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చి ఇంటి తలుపు తట్టగా ఎంతసేపటికీ తీయలేదు. అనుమానంతో కిటికీలోంచి చూడగా లోపల దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా, వాసు ఫ్యాన్‌కు ఉరేసుకుని, అనిత మంచంపై విగతజీవులుగా కనిపించారు. కొడుకు, కోడలిని ఆ స్థితిలో చూసి తల్లి అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయింది.

ఈ ఘటనలో అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే, అనిత గర్భంలో ఉన్న బిడ్డను బతికించేందుకు పోలీసులు ఆమెను హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. అయితే, అప్పటికే గర్భంలోని ఆడశిశువు కూడా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

వాసు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌ మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వాసు ఉరేసుకుని ఉండగా, అనిత మంచంపై పడి ఉండటంతో.. భార్యకు విషమిచ్చి లేదా హత్య చేసి వాసు ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పెళ్లైన నాటి నుంచి వారిద్దరూ ఎంతో ఆనందంగా, అన్యోన్యంగా ఉండేవారని, వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని తల్లి, బంధువులు పోలీసులకు తెలిపారు. దీంతో వారి మృతికి గల కారణాలపై మిస్టరీ నెలకొంది. పోలీసులు చుట్టుపక్కల వారిని విచారిస్తూ ఆధారాలు సేకరిస్తున్నారు. 
Surisetti Vasu
Visakhapatnam
Akkayyapalem
Andhra Pradesh
Suicide
Couple suicide
Pregnant woman death
KG Hospital
Police investigation
Mystery death

More Telugu News