రోడ్డుపై చెత్త పడేసే వారిని వీడియో తీసి పంపిస్తే రూ.250 రివార్డు.. ఎక్కడంటే!

  • బెంగళూరు వాసులకు నగర పాలక సంస్థ వినూత్న ఆఫర్
  • ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేయనున్న అధికారులు
  • రోడ్లు పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా బహుమతి ప్రకటన
  • రోడ్లపై చెత్త పడేస్తే తీసుకువచ్చి ఇంటిముందే పోస్తామని ఇప్పటికే హెచ్చరిక
రోడ్లపై చెత్త పడేసే వారికి బెంగళూరు నగర పాలక సంస్థ మరో షాకిచ్చింది. మీ కళ్ల ముందు ఎవరైనా రోడ్డుపై చెత్త పారేస్తుంటే వీడియో తీసి పంపించాలని, ఒక్కో వీడియోకు రూ.250 చొప్పున బహుమతి ఇస్తామని తెలిపింది. రోడ్లను పరిశుభ్రంగా ఉంచడానికే ఈ వినూత్న ప్రతిపాదనతో ముందుకొచ్చినట్లు అధికారవర్గాలు తెలిపాయి. రోడ్డుపై చెత్త పడేస్తే అదంతా తీసుకొచ్చి మీ ఇంటిముందే కుమ్మరిస్తామంటూ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. వీధుల్లోని సీసీటీవీ కెమెరాల సాయంతో రోడ్లపై చెత్త పారేసే వారిని గుర్తించి చెత్తను తీసుకెళ్లి వారి ఇంటిముందు కుమ్మరిస్తున్నారు.

అయితే, సీసీటీవీ కెమెరాలు లేనిచోట, ఎవరూ గుర్తించలేరనే ధైర్యంతో కొంతమంది రోడ్లపైనే చెత్త పారేస్తున్నారు. ఇలాంటి వారిని కట్టడి చేయడానికి నగర వాసుల సహకారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రివార్డు పథకానికి శ్రీకారం చుట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ పథకాన్ని సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గ్రేటర్ బెంగళూరు నగర పాలక సంస్థ అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

బెంగళూరు నగర వీధులను పరిశుభ్రంగా ఉంచేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నామని బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ (బీఎస్ డబ్ల్యూఎంఎల్) సీఈవో కరిగౌడ పేర్కొన్నారు. తమ సంస్థకు చెందిన 5 వేల ఆటోలు రోజూ నగర వీధుల్లో తిరుగుతూ తడి, పొడి చెత్తను సేకరిస్తాయని తెలిపారు. అయినప్పటికీ కొంతమంది చెత్తను రోడ్డుపైనే పారేస్తున్నారని, ఇది సరికాదని ఆయన చెప్పారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే విషయంలో పౌరులు కూడా తమ వంతు బాధ్యతను నిర్వహించాలని కరిగౌడ కోరారు.


More Telugu News