Narendra Modi: రూ. 7,000 కోట్లతో రేర్ ఎర్త్ రంగంలోకి భారత్... చైనా ఆధిపత్యానికి గండి!

Narendra Modi Government Invests in Rare Earth Sector to Counter China
  • చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు కేంద్రం భారీ వ్యూహం
  • రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారీకి రూ. 7,000 కోట్లకు పైగా ప్రోత్సాహకాలు
  • ప్రస్తుత పథకాన్ని మూడు రెట్లు పెంచాలని ప్రభుత్వ ప్రతిపాదన
  • ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగాలకు ఈ ఖనిజాలు అత్యంత కీలకం
  • చైనా ఎగుమతులపై ఆంక్షల నేపథ్యంలో భారత్ వేగంగా అడుగులు
అరుదైన భూమి అయస్కాంతాల (రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్) తయారీ రంగంలో చైనా ఆధిపత్యానికి గండికొట్టేందుకు భారత్ ఓ భారీ వ్యూహంతో ముందుకొస్తోంది. ఈ కీలక రంగంలో తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పథకం విలువను మూడు రెట్లు పెంచి రూ. 7,000 కోట్లకు (సుమారు 788 మిలియన్ డాలర్లు) పైగా చేయాలని యోచిస్తున్నట్టు బ్లూమ్‌బర్గ్ తన కథనంలో వెల్లడించింది.

ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, రక్షణ పరికరాల తయారీలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం రేర్ ఎర్త్ ఖనిజాలను చైనాయే ప్రాసెస్ చేస్తోంది. ఇటీవల ఏప్రిల్‌లో ఈ ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు కఠినతరం చేయడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ‘కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చవద్దని’ ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించిన నేపథ్యంలోనే తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ అంశంపై తుది కేటాయింపులు మారే అవకాశం ఉన్నప్పటికీ, తాజా ప్రతిపాదన ప్రస్తుతం కేబినెట్ ఆమోదం కోసం ఎదురుచూస్తోందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఈ పథకం కింద, ఉత్పత్తి ఆధారిత, మూలధన సబ్సిడీల ద్వారా సుమారు ఐదు కంపెనీలకు ప్రభుత్వం మద్దతు ఇవ్వనుంది.

అయితే, చైనా ఆధిపత్యాన్ని సవాలు చేయడం భారత్‌కు అంత సులభం కాదు. నిధుల కొరత, సాంకేతిక నైపుణ్యం లేకపోవడం, రేడియోధార్మిక వ్యర్థాల కారణంగా తవ్వకాలలో పర్యావరణ సమస్యలు వంటి సవాళ్లు ఎదురుకానున్నాయి. ఇదే సమయంలో, మ్యాగ్నెట్ రహిత ప్రత్యామ్నాయాలపై కూడా భారత్ దృష్టి సారిస్తోంది. రేర్ ఎర్త్ ఖనిజాలపై ఆధారపడటాన్ని తగ్గించే సింక్రోనస్ రిలక్టెన్స్ మోటార్ల సాంకేతికతపై పరిశోధనలకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది.

దేశీయంగా తవ్వకాలు లాభసాటిగా లేకపోవడంతో, విదేశాల్లో మైనింగ్ భాగస్వామ్యాల కోసం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అయితే, అమెరికా, యూరప్‌ దేశాలకు ఇచ్చినట్టుగానే, భారత్‌కు కూడా చైనా ఎగుమతి నియంత్రణలను సడలిస్తే పరిస్థితి మారవచ్చు. అలా జరిగితే, చౌకైన చైనా మ్యాగ్నెట్స్ భారత మార్కెట్‌ను ముంచెత్తి, దేశీయంగా పెట్టుబడులను దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Narendra Modi
Rare Earth Magnets
Rare Earth
China
Electric Vehicles
Renewable Energy
Mining
Exports
Geopolitics
Critical Minerals

More Telugu News