Sachin Tendulkar: 1983 విజయాన్ని గుర్తుచేశారు.. భారత అమ్మాయిల‌పై సచిన్ ప్రశంసలు

Sachin Tendulkar Recalls 1983 Victory Praises Indian Womens Team
  • తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టు
  • జట్టు విజయాన్ని 1983 ప్రపంచకప్‌తో పోల్చిన సచిన్ టెండూల్కర్
  • భారత అమ్మాయిలు దేశం గర్వపడేలా చేశారంటూ కితాబు
  • భారత మహిళల క్రికెట్ ప్రస్థానంలో ఇది ఒక చారిత్రక ఘట్టమ‌న్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌
భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి ఐసీసీ వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం రాత్రి ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు.. దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడోసారి ఫైనల్ ఆడిన భారత అమ్మాయిలు ఈసారి పట్టు వదలకుండా ఆడి ట్రోఫీని ముద్దాడారు. ఈ విజయంతో ఐసీసీ ట్రోఫీ కోసం భారత మహిళల జట్టు సుదీర్ఘ ఎదురుచూపులకు తెరపడినట్లయింది. 

ఈ చారిత్రక విజయంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. భారత మహిళల జట్టును అభినందిస్తూ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టాడు. "1983 ప్రపంచకప్ విజయం ఒక తరాన్ని పెద్ద కలలు కనేలా స్ఫూర్తినిచ్చింది. ఈ రోజు మన మహిళల జట్టు అదే స్థాయిలో అద్భుతం చేసింది. దేశవ్యాప్తంగా ఎంతో మంది యువతులు బ్యాట్, బాల్ పట్టుకుని మైదానంలోకి అడుగుపెట్టేలా ప్రేరణ ఇచ్చింది. భారత మహిళల క్రికెట్ ప్రస్థానంలో ఇది ఒక చారిత్రక ఘట్టం. టీమిండియాకు అభినందనలు. మీరు దేశం గర్వపడేలా చేశారు" అని సచిన్ పేర్కొన్నాడు.
Sachin Tendulkar
India Women's Cricket
ICC World Cup
Harmanpreet Kaur
South Africa
1983 World Cup
Indian Cricket Team
Women's Cricket
DY Patil Stadium
Cricket

More Telugu News