Mahesh Babu: వైరల్ అవుతున్న 'రాజమౌళి-మహేశ్ బాబు-ప్రియాంక-పృథ్వీరాజ్' ఎక్స్ ఛాటింగ్

Mahesh Babu Asks Rajamouli for SSMB29 Update on X
  • అప్‌డేట్ కోసం రాజమౌళిని సరదాగా నిలదీసిన మహేశ్ బాబు
  • సంభాషణలో ప్రియాంక, పృథ్వీరాజ్ ఉన్నారని చెప్పేసిన సూపర్ స్టార్
  • నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ రివీల్ ఈవెంట్
  • తొలిసారిగా ఈవెంట్‌ను లైవ్ స్ట్రీమ్ చేయనున్న జియోహాట్‌స్టార్
  • చిత్రం కోసం రూ.50 కోట్లతో భారీ వారణాసి సెట్ నిర్మాణం
  • 2027 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల!
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం SSMB29 కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ నెలలో ఓ అదిరిపోయే అప్‌డేట్ ఉంటుందని రాజమౌళి హింట్ ఇవ్వడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో, మహేశ్ బాబు స్వయంగా 'ఎక్స్' వేదికగా రాజమౌళిని అప్‌డేట్ గురించి సరదాగా ప్రశ్నించగా, అది కాస్తా తారల మధ్య ఓ ఫన్నీ సంభాషణకు దారితీసింది. ఈ చర్చలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా చేరడంతో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

ఎక్స్‌లో స్టార్స్ మధ్య సాగిన సంభాషణ యథాతథంగా...!

మహేశ్‌: రాజమౌళి గారూ, నవంబరు వచ్చేసింది. అప్‌డేట్‌ ఎప్పుడిస్తారు?

రాజమౌళి: అవును. ఈ నెలలో ఏ సినిమాకి రివ్యూ ఇద్దామనుకుంటున్నావ్‌?

మహేశ్‌: మీ డ్రీమ్‌ ప్రాజెక్టు మహాభారత రివ్యూ ఇవ్వాలనుకుంటున్నా సర్‌. నవంబరులో అప్‌డేట్‌ ఇస్తానని ప్రామిస్‌ చేశారు. మాట నిలబెట్టుకోండి.

రాజమౌళి: ఇప్పుడే కదా మొదలైంది మహేశ్‌. ఒక దాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఇద్దాం.

మహేశ్‌: ఎంత నెమ్మదిగా సర్‌. 2030లో మొదలుపెడదామా? ప్రియాంకా చోప్రా ఇప్పటికే హైదరాబాద్‌ వీధుల్లో ఇన్‌స్టా రీల్స్‌ చేస్తోంది.

ప్రియాంక: హలో హీరో. సెట్స్‌లో మీరు చెప్పే విషయాలన్నీ నేను లీక్‌ చేయనా? మైండ్‌లో ఫిక్స్‌ అయితే బ్లైండ్‌గా వేసేస్తా.

రాజమౌళి: మహేశ్‌, ప్రియాంక చోప్రా ఉందనే సంగతి ఎందుకు చెప్పావ్‌? నువ్వు సర్‌ప్రైజ్‌ను మిస్‌ చేశావ్‌.

మహేశ్‌: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఉన్నారనే విషయాన్నీ దాచాలనుకున్నారా?

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌: రాజమౌళి సర్‌, హైదరాబాద్‌ వెకేషన్‌కు ఎందుకొస్తున్నానో ఇంట్లో కారణాలు చెప్పలేకపోతున్నా. ఇలాగే కొనసాగిస్తే నా కుటుంబం నన్ను అనుమానించడం ప్రారంభిస్తుంది (నవ్వుతూ).

రాజమౌళి: మహేశ్‌, నువ్వు అన్ని సర్‌ప్రైజ్‌లూ బయటపెట్టేశావ్‌. అందుకే నీ ఫస్ట్‌లుక్‌ వాయిదా వేయాలనుకుంటున్నా.

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌: మీరు మీ విలన్స్‌ని ఎంతగా ఇష్టపడతారో నాకు తెలుసు సర్‌.

ప్రియాంక: బెటర్‌ లక్‌ నెక్స్ట్‌ టైమ్‌ మహేశ్‌.

మహేశ్‌: ది బెస్ట్‌ని ఎప్పుడూ రాజమౌళి చివరిలోనే చూపిస్తారు.

నవంబర్ 15న గ్రాండ్ ఈవెంట్!

ఈ సరదా సంభాషణతో సినిమాపై ఉత్కంఠ మరింత పెరగగా, చిత్ర యూనిట్ ఓ భారీ ఈవెంట్‌కు సన్నాహాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'ఫస్ట్ రివీల్' పేరిట ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర టైటిల్‌తో పాటు ఓ పవర్‌ఫుల్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. భారతీయ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఈ మొత్తం ఈవెంట్‌ను 'జియోహాట్‌స్టార్' ప్లాట్‌ఫామ్‌లో లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ఇందుకోసం డిజిటల్ హక్కులను ఆ సంస్థ దక్కించుకుంది.

చిత్రం కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో సుమారు రూ.50 కోట్ల భారీ బడ్జెట్‌తో వారణాసి సెటప్‌ను నిర్మించారు. అవుట్‌డోర్ లొకేషన్లలో చిత్రీకరణ కష్టతరం కావడంతో, అదే వాతావరణాన్ని ఇక్కడ సృష్టించినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Mahesh Babu
SSMB29
Rajamouli
Priyanka Chopra
Prithviraj Sukumaran
Mahabharata
Ramoji Film City
First Reveal
Telugu cinema
KL Narayana

More Telugu News