కుటుంబ సమేతంగా వరల్డ్ కప్ ఫైనల్ కు హాజరైన మంత్రి నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో!

  • నవీ ముంబైలో మహిళల వరల్డ్ కప్ ఫైనల్
  • భారత్, దక్షిణాఫ్రికా అమీతుమీ
  • భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి లోకేశ్ మ్యాచ్ వీక్షణ
  • క్రికెట్ దిగ్గజం సచిన్ ను కలిసిన లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కు హాజరయ్యారు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తుదిపోరును ఆయన తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చారు. తొలిసారి ప్రపంచకప్ టైటిల్ ను ముద్దాడాలని తలపడుతున్న భారత మహిళల జట్టుకు మద్దతుగా నిలిచారు.

ఈ సందర్భంగా తన ఆనందాన్ని లోకేశ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "చరిత్రను ప్రత్యక్షంగా చూసేందుకు బ్రాహ్మణి, దేవాన్ష్ తో కలిసి నవీ ముంబైలో ఉన్నాను. భారత జట్టుకు మద్దతు తెలపడం, మహిళల క్రికెట్ ఎదుగుదలను వేడుక చేసుకోవడం గర్వంగా ఉంది. స్టేడియంలో వాతావరణం అద్భుతంగా ఉంది. ఇలాంటి క్షణాలను కుటుంబంతో పంచుకోవడం, తర్వాతి తరానికి స్ఫూర్తినివ్వడం గొప్ప అనుభూతి" అని ఆయన పేర్కొన్నారు.

ఈ మ్యాచ్ సందర్భంగా లోకేశ్ కు ఓ మధురానుభూతి ఎదురైంది. క్రికెట్ దేవుడిగా పేరుపొందిన దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ను ఆయన కలుసుకున్నారు. ఈ భేటీ తనకు ఒక 'ఫ్యాన్ బాయ్ మూమెంట్' అని లోకేశ్ అభివర్ణించారు. సచిన్ వినయం, ఆప్యాయత గురించి విన్నవన్నీ నిజమేనని, వాటిని స్వయంగా అనుభవించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తరతరాలకు స్ఫూర్తినిచ్చిన గొప్ప క్రీడాకారుడే కాకుండా, అంతకంటే గొప్ప మానవతావాది అని సచిన్ ను లోకేశ్ ప్రశంసించారు. 

ఈ క్రమంలోనే లోకేశ్ దంపతులు ఐసీసీ చైర్మన్ జై షాను, ఆయన మాతృమూర్తిని కూడా కలిశారు. ఈ మేరకు లోకేశ్ ఫొటోలు పంచుకున్నారు.


More Telugu News