KTR: హైడ్రాపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR Slams Congress Government Over Hydra Demolitions
  • పేదోళ్ల ఇండ్లు తప్ప పెద్దోళ్ల భవంతులు కూల్చే ధైర్యం లేదన్న కేటీఆర్
  • పెద్దలకో న్యాయం పేదోళ్లకో న్యాయమని ఆరోపణ
  • పదేళ్ల కేసీఆర్ పాలనలో నిర్మాణాలు.. కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలు
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకో న్యాయం, పెద్దోళ్లకో న్యాయమనే రీతిలో పనిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో హైడ్రా విధ్వంసం సృష్టిస్తోందని మండిపడ్డారు. హైడ్రా చర్యలపై ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. కేసీఆర్‌ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో నిర్మాణాలు మాత్రమే కనిపిస్తాయి.. కానీ కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలే కనిపిస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్ పాలనలో సచివాలయం, టీహబ్‌, వీహబ్‌, పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మించామని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్‌ నగరంలో 42 ఫ్లైఓవర్లు, అండర్‌ పాస్‌లు నిర్మించామని మాజీ మంత్రి చెప్పారు.

పేదల పైనే హైడ్రా ప్రతాపం..
ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో హైడ్రా పేదవాళ్ల ఇళ్లను కూల్చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగిన వారికి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూములను, చెరువులను ఆక్రమించిన పెద్దోళ్ల విషయంలో హైడ్రా చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి చెరువును పూడ్చి ఇల్లు కడితే ఆ ఇంటిని ఎందుకు కూల్చలేదని కేటీఆర్ హైడ్రా చీఫ్ ను నిలదీశారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన మంత్రి వివేక్‌ ఇల్లు కూల్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చకుండా, ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే సమయం ఇచ్చిందని విమర్శించారు. గాజులరామారంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్థలం జోలికి వెళ్లలేదు కానీ అదే గాజులరామారంలో పేదల ఇళ్లపైకి హైడ్రా బుల్డోజర్లను పంపిందని కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR
K Taraka Rama Rao
BRS
Telangana
Hydra
Demolition
Congress Government
Ponguleti
Vivek
Arikepudi Gandhi

More Telugu News