Anagani Satya Prasad: మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టుపై మంత్రి అనగాని రియాక్షన్

Minister Anagani Comments on Jogi Ramesh Arrest Fake Liquor Case
  • జోగి పాపం పండిందని వ్యాఖ్య
  • నకిలీ మద్యం తయారు చేయించాడంటూ తీవ్ర ఆరోపణలు
  • సూత్రధారి జోగి.. పాత్రధారి అద్దేపల్లి ముఠా అన్న మంత్రి
జగన్ పాలనలో నకిలీ మద్యంతో వేలాది మంది ప్రాణాలు తీశారని, వారి భార్యల మాంగళ్యాలు మంటగలిశాయని మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టుపై మంత్రి స్పందిస్తూ.. జోగి పాపం పండిందని వ్యాఖ్యానించారు. నకిలీ మద్యం వ్యవహారంలో జోగి సూత్రధారి కాగా,  పాత్రధారి అద్దేపల్లి జనార్థన్ రావు ముఠా అని ఆరోపించారు. నకిలీ మద్యం తయారు చేయించి బెల్టు షాపులు, ప్రభుత్వ షాపుల్లో అమ్మించాడని జోగి రమేశ్ పై మండిపడ్డారు. జగన్ ‘జే’ బ్రాండ్ మద్యం వల్ల ఏపీలో లక్షలాదిమంది ఆరోగ్యాలు గుల్ల అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేశారని మంత్రి ఆరోపించారు.

ఆఫ్రికాకు పారిపోయే ముందు జనార్థనరావు మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి ఎందుకు వెళ్లాడని మంత్రి సత్య ప్రసాద్ ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ బయటకు వచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. న్యాయస్థానాల్లో సీసీటీవీ పుటేజ్ కు విలువ వుంటుందిగాని జోగి రమేశ్ ప్రమాణాలు, ఒట్టుకు, సవాళ్లకు విలువ ఉండదని చెప్పారు. మాజీ మంత్రికి ఈ కనీస జ్ఞానం కూడా లేదని ఎద్దేవా చేశారు. సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ప్రమాణాలతో ప్రజలను వెర్రివాళ్లని చేయాలని జగన్ ముఠా భావిస్తోందని చెప్పారు.

జోగి రమేశ్ ప్రలోభాలతోనే 2022 నుంచి నకిలీ మద్యం తయారీ ప్రారంభించానని అద్దేపల్లి వాంగ్మూలం ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. అతడికి రూ.3 కోట్లు ఆశ పెట్టింది, బాల్యం నుంచి వారిద్దరు స్నేహితులనేది నిజం కాదా అని అడిగారు. ఇలాంటి నిజాలు ఎన్నో ఉన్నా జగన్ అతడిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. ఇద్దరూ తోడుదొంగలు కాబట్టే చర్యలు తీసుకోలేదన్నారు. తెలుగుదేశం పార్టీ నకిలీ మద్యం తయారీ, అమ్మకాలను సహించదు కాబట్టే జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ప్రభుత్వం కేసు నమోదు చేసిందని చెప్పారు. జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసి టీడీపీ తన నిజాయితీని రుజువు చేసుకుందని మంత్రి సత్య ప్రసాద్ చెప్పారు.

వైసీపీ మాత్రం జోగి రమేశ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా ప్రశ్నించిన వారిపైనే ఎదురుదాడి చేస్తోందని విమర్శించారు. నేరస్తులపై చర్య తీసుకోవడం కక్ష సాధింపు ఎలా అవుతుందని మంత్రి ఈ సందర్భంగా ప్రశ్నించారు. జోగి అరెస్టును కక్ష సాధింపు చర్య అంటూ జగన్ ముఠా చేసే కాకి గోలను రాష్ట్ర ప్రజలు నమ్మబోరని చెప్పారు. నేరస్తులకు కులాలు ఉండవని, వీరు కుల ద్రోహులు కూడా అవుతారని చెప్పారు. వేలాది పేదల ప్రాణాలు తీసిన నకిలీ మద్యం తయారీదారులను అరెస్టు చేసిన సిట్ అధికారులను ప్రజలు అభినందిస్తున్నారని మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు.
Anagani Satya Prasad
Jogi Ramesh
Fake liquor
Andhra Pradesh
YSRCP
TDP
Addeppalli Janardhan Rao
AgriGold lands
AP Politics
Crime

More Telugu News