DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అంశం.. డీకే శివకుమార్ ఏమన్నారంటే?

DK Shivakumar responds to Karnataka CM change rumors
  • నాయకత్వ మార్పు ఊహాగానాలను తోసిపుచ్చిన డీ.కె. శివకుమార్
  • ముఖ్యమంత్రి లేదా నేను చెబితేనే నమ్మాలన్న ఉప ముఖ్యమంత్రి
  • ప్రస్తుతానికి మరో నాయకుడిని వెతకాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. నాయకత్వ మార్పు ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. కర్ణాటక ప్రభుత్వం పూర్తి ఐక్యతతో ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి లేదా తాను చెప్పిన మాటలను మాత్రమే నమ్మాలని సూచించారు. ఇంకెవరి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతానికి మరో నాయకుడిని వెతకాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు.

బెంగళూరులోని కంఠీరవ స్టేడియం సమీపంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం దృష్టి పాలన, అభివృద్ధి పైనే ఉందని అన్నారు. ఊహాగానాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తనకు మంచి అనుబంధం ఉందని, తమ మధ్య మంచి సమన్వయం ఉందని డీకే శివకుమార్ తెలిపారు. తమ ఐక్యత కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో 136 శాసనసభ స్థానాలను గెలుచుకున్నామని, ఆ తర్వాత తమ బలాన్ని 140కి పెంచుకున్నామని చెప్పారు.

రెండున్నరేళ్ల అనంతరం ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఆయన ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి మార్పు అంశానికి తెరదించేలా డీకే శివకుమార్ మాట్లాడారు.
DK Shivakumar
Karnataka politics
Karnataka CM
Siddaramaiah
Karnataka government
Congress

More Telugu News