Cyclone Michaung: బీహార్ లో ఎన్నికల ప్రచారానికి మొంథా తుపాను దెబ్బ

Cyclone Michaung Disrupts Bihar Election Campaign Rallies
  • బీహార్‌ను అతలాకుతలం చేస్తున్న మొంథా తుపాను
  • ఎన్నికల ప్రచార సభలపై తీవ్ర ప్రభావం
  • హెలికాప్టర్లు ఎగరక పలువురు నేతల ర్యాలీలు రద్దు
  • వరి పంటకు తీవ్ర నష్టం.. రైతుల ఆందోళన
  • పలు జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ
  • ఆదివారం నుంచి వాతావరణంలో మెరుగుదల
తీరం దాటినా గానీ మొంథా తుపాను అనేక రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. తాజాగా, బీహార్ రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలుల కారణంగా జనజీవనం స్తంభించడంతో పాటు, రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ప్రతికూల వాతావరణంతో శుక్రవారం దాదాపు 23 ఎన్నికల ర్యాలీలు రద్దయ్యాయి. శనివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది.

వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లు ఎగిరే పరిస్థితి లేకపోయింది. దీంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ, నటుడు పవన్ సింగ్ వంటి పలువురు కీలక నేతలు తమ ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కొందరు నేతలు సభలకు భౌతికంగా హాజరుకాలేకపోయినా, మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. శనివారం సహర్సాలో జరగాల్సిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ర్యాలీ కూడా రద్దయింది. దీంతో ఆమె బచ్‌వారా అసెంబ్లీ నియోజకవర్గానికి రోడ్డు మార్గంలో వెళ్లి సభలో పాల్గొన్నారు.

ఈ తుపాను ప్రభావం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ పంటలకు, ముఖ్యంగా వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న పంట దెబ్బతినడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ ప్రకారం, శనివారం కూడా చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురు గాలులు కొనసాగే అవకాశం ఉంది. అరారియా, కిషన్‌గంజ్, పూర్నియా ప్రాంతాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని చాలా నగరాల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శనివారం బంకాలో అత్యధికంగా 27.4 డిగ్రీల సెల్సియస్, వాల్మీకి నగర్‌లో అత్యల్పంగా 20.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని పరిపాలన యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. ఆదివారం (నవంబర్ 2) నుంచి వాతావరణం క్రమంగా మెరుగుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Cyclone Michaung
Bihar Elections
Nitish Kumar
Tejashwi Yadav
JP Nadda
Bihar Weather
Priyanka Gandhi
Khareef Crop Damage
Bihar Rains
Election Campaign

More Telugu News