Priyanka Gandhi: బీజేపీ, జేడీయూ ఇన్నేళ్లేం చేశాయి?: ఎన్డీయే కీలక హామీపై ప్రియాంక గాంధీ ప్రశ్న

Priyanka Gandhi Questions NDA on Unfulfilled Promises in Bihar
  • ఎన్డీయే కోటి ఉద్యోగాల హామీ గురించి మీడియా ప్రశ్నించగా స్పందించిన ప్రియాంక గాంధీ
  • బీజేపీ నకిలీ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తోందని విమర్శ
  • ప్రజల దృష్టిని మళ్లించలేక ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆగ్రహం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి విజయం సాధిస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీ ధీమా వ్యక్తం చేశారు. బీహార్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందు ఆమె పాట్నా విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఎన్డీయే కూటమి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని విమర్శించారు.

ఎన్డీయే ప్రభుత్వం కోటి ఉద్యోగాల హామీ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఇన్నేళ్లు అధికారంలో ఉండి ఎందుకు నెరవేర్చలేదని ఆమె బీజేపీ, జేడీయూలను నిలదీశారు.

బెగుసరాయ్‌లో తొలి ప్రచార సభలో ప్రియాంక గాంధీ విమర్శలు

ఎన్నికల్లో గెలుపొందేందుకు ఎన్డీయే ప్రభుత్వం విభజన రాజకీయాలకు పాల్పడుతోందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. బెగుసరాయ్‌లో తన తొలి ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, బీజేపీ నకిలీ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించలేక ఓట్ల చోరీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఓట్ల తొలగింపు అనేది హక్కుల ఉల్లంఘనతో సమానమని ఆమె వ్యాఖ్యానించారు.

దేశాభివృద్ధికి బీహార్ ఎంతో తోడ్పడిందని, కానీ రాష్ట్రాభివృద్ధి విషయంలో మాత్రం వెనుకబడి ఉందని ఆమె అన్నారు. బీజేపీ నాయకులు నిత్యం గతం, భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నారని, ప్రస్తుతం గురించి మాత్రం మాట్లాడటం లేదని విమర్శించారు. నెహ్రూ, ఇందిరాగాంధీలను విమర్శిస్తున్నారే తప్ప నిరుద్యోగం, వలసల గురించి పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. విభజన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

బీహార్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం లేదని, ప్రతిదీ ఢిల్లీ నుంచి నియంత్రిస్తారని ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్డీయే పాలనలో పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిమందికే అప్పగించారని ఆరోపించారు.
Priyanka Gandhi
Bihar Elections
NDA
India Alliance
Employment
Privatization
BJP
JDU
Rahul Gandhi

More Telugu News