Talasani Srinivas Yadav: పదవికి రాజీనామా చేయడానికి కూడా రెడీ: తలసాని శ్రీనివాస్ యాదవ్

BRS MLA Talasani Slams Congress Government in Telangana
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు
హైదరాబాద్‌కు రెండేళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్
కంటోన్మెంట్‌లో అభివృద్ధి చూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్
మాజీ మంత్రి, సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన సవాల్ విసిరారు.

శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోనే హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా, హైదరాబాద్‌కు రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు.

"జూబ్లీహిల్స్‌లో ఓటమి భయం పట్టుకోవడం వల్లే అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు" అని తలసాని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే రేషన్ కార్డులు, బియ్యం ఆగిపోతాయంటూ ఆ పార్టీ నేతలు ప్రజలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలతో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయించాలో బీఆర్ఎస్‌కు బాగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే అని తలసాని ధీమా వ్యక్తం చేశారు. అత్యంత భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అసెంబ్లీలో అడుగుపెడతారని ఆయన జోస్యం చెప్పారు. 
Talasani Srinivas Yadav
Telangana Politics
BRS Party
Revanth Reddy
Hyderabad Development
Jubilee Hills Election
Maganti Sunitha
Telangana Congress
Cantonment Development
Telangana Assembly Elections

More Telugu News