Siddaramaiah: ఇంగ్లీష్, హిందీ భాషలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు

Siddaramaiah comments on English Hindi languages impact
  • ఆ భాషలు దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లల నైపుణ్యాలను బలహీనపరుస్తున్నాయని వ్యాఖ్య
  • విద్యా సంస్థల్లో మాతృభాషను ప్రోత్సహించేలా కేంద్రం చట్టం తేవాలని డిమాండ్
  • అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లలు మాతృభాషలోనే నేర్చుకుంటారన్న సిద్ధరామయ్య
దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ, ఇంగ్లీష్ భాషలు పిల్లల నైపుణ్యాలను బలహీనపరుస్తున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. విద్యాసంస్థల్లో మాతృభాషను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, దక్షిణాది రాష్ట్రాలకు హిందీ భాష విషయంలో మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో సిద్ధరామయ్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కర్ణాటకపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తూ హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అభివృద్ధి చెందిన దేశాలలో పిల్లలు తమ మాతృభాషలోనే విద్యను అభ్యసిస్తారని, మన దేశంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఇంగ్లీష్, హిందీ భాషలు పిల్లల నైపుణ్యాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మాతృభాషను బోధనా మాధ్యమంగా ప్రవేశపెడుతూ కేంద్రం చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. విద్య విషయంలో కన్నడ భాష పట్ల జరుగుతున్న నిర్లక్ష్యం రాష్ట్రంలో అనేక సమస్యలకు కారణమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. హిందీ, సంస్కత భాషాభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న కేంద్రం, దేశంలోని ఇతర మాతృభాషల అభివృద్ధికి మాత్రం గ్రాంట్లు మంజూరు చేయడం లేదని ఆయన ఆరోపించారు.

కన్నడను వ్యతిరేకించే వారిని రాష్ట్ర ప్రజలు కూడా వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ. 4.5 లక్షల కోట్ల ఆదాయం వెళుతున్నప్పటికీ, కేంద్రం నుంచి మాత్రం కర్ణాటక అభివృద్ధికి తగిన నిధులు రావడం లేదని ఆయన ఆరోపించారు.
Siddaramaiah
Karnataka Chief Minister
English language
Hindi language
Mother tongue
Education policy

More Telugu News