Tejashwi Yadav: నా వయస్సు చిన్నదే కావొచ్చు కానీ పరిణతితోనే ఆ కీలక హామీ ఇచ్చాను: తేజస్వి యాదవ్

Tejashwi Yadav on Bihar Job Promise Despite Young Age
  • అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తేజస్వి యాదవ్ హామీ
  • సాధ్యాసాధ్యాలపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులు
  • బీహార్‌ను అన్నింటా నెంబర్ వన్‌గా మార్చాలనేదే తన లక్ష్యమని వెల్లడి
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయడంలో సాధ్యా సాధ్యాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తేజస్వి యాదవ్ స్పందించారు. తనకు వయస్సు లేకపోవచ్చు కానీ పరిణతి ఉందని వ్యాఖ్యానించారు. అందుకే ఆ కీలక హామీ ఇచ్చినట్లు చెప్పారు.

ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఆర్థిక న్యాయం, సమ్మిళిత వృద్ధితో బీహార్‌ను భారత్‌లోనే నెంబర్ వన్‌ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో తాను ముందుకు వెళతానని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే, రాష్ట్ర ప్రజలు ఉద్యోగాల కోసం ఇల్లు, ఊరు వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు.

తమ ప్రభుత్వం ఏర్పడిన ఇరవై రోజుల్లోనే ప్రతిపాదిత చట్టాన్ని తీసుకువస్తామని పునరుద్ఘాటించారు. ప్రతి ఒక్కరికి రాష్ట్రంలోనే అవకాశం దొరికేలా చేస్తామని అన్నారు. బీహార్‌లో అన్ని ఫ్యాక్టరీలు ఉంటాయని, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, అత్యాధునిక ఆసుపత్రులు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

బీహార్‌ను విద్యా హబ్‌గా మార్చాలనేది తన లక్ష్యమని తేజస్వి యాదవ్ అన్నారు. మన విద్యార్థులు పరీక్షలకు సమాయత్తమయ్యేందుకు కోట వంటి నగరాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా చేస్తామని అన్నారు. ప్రస్తుతం దేశంలోనే బీహార్ పేద రాష్ట్రమని, తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందని అన్నారు. అందరికీ విద్య, అత్యాధునిక వైద్యం, అందరికీ ఆదాయం, ఉద్యోగ, న్యాయ అవకాశాల ద్వారా బీహార్ తలరాతను మారుస్తామని అన్నారు.
Tejashwi Yadav
Bihar election
Bihar jobs
Government jobs promise
RJD leader
Bihar development

More Telugu News