Golden Toilet: వేలానికి బంగారు టాయిలెట్.. ధర తెలిస్తే షాకే!

Golden Toilet by Maurizio Cattelan Expected to Fetch Millions at Auction
  • వేలానికి రానున్న పూర్తి బంగారు టాయిలెట్
  • కనీస ధర 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 83 కోట్లు)
  • ఇటాలియన్ కళాకారుడు మారిజియో కాటెలాన్ సృష్టి 'అమెరికా'
  • ఈ నెల‌ 18న న్యూయార్క్‌లో సోత్’బీస్ వేలం
ప్రపంచంలోనే అత్యంత విలువైన టాయిలెట్ వేలానికి రాబోతోంది. ఇది సాధారణ టాయిలెట్ కాదు, పూర్తిగా బంగారంతో తయారు చేసిన కళాఖండం. ఇటాలియన్ కళాకారుడు మారిజియో కాటెలాన్ రూపొందించిన ఈ 18 క్యారెట్ల బంగారు టాయిలెట్‌కు 'అమెరికా' అని పేరు పెట్టారు. దీనిని ప్రముఖ వేలం సంస్థ సోత్’బీస్ ఈ నెల‌ 18న న్యూయార్క్‌లో వేలం వేయనుంది. దీని కనీస ధరను సుమారు 10 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 83 కోట్లు) నిర్ణయించారు.

ఈ టాయిలెట్ బరువు 101.2 కిలోలు. ఇది కేవలం ప్రదర్శన వస్తువు మాత్రమే కాదు, పూర్తిగా పనిచేసే టాయిలెట్ కూడా. సంపన్నుల విలాసాలపై వ్యంగ్యాస్త్రంగా కాటెలాన్ దీనిని రూపొందించారు. ఈయన గతంలో గోడకు డక్ట్ టేప్‌తో అతికించిన ఒక అరటిపండును 'కామెడియన్' పేరుతో ప్రదర్శించి, దానిని 6.2 మిలియన్ డాలర్లకు విక్రయించి సంచలనం సృష్టించారు. అలాగే, మోకాళ్లపై కూర్చుని ఉన్న హిట్లర్ శిల్పాన్ని 17.2 మిలియన్ డాలర్లకు అమ్మారు.

ఈ బంగారు టాయిలెట్‌కు ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. 2016లో కాటెలాన్ ఇలాంటివి రెండు టాయిలెట్లను తయారు చేశారు. వాటిలో ఒకటి 2019లో ఇంగ్లండ్‌లోని బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లో ప్రదర్శనలో ఉండగా, దొంగతనానికి గురైంది. దొంగలు దానిని ప్లంబింగ్‌తో పాటు పెకిలించుకుని పారిపోయారు. ఆ టాయిలెట్ ఇప్పటికీ దొరకలేదు. దానిని దొంగలు కరిగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు వేలానికి వస్తున్నది రెండవది. దీనిని 2017 నుంచి ఒక ప్రైవేట్ ‌స్థలంలో భద్రపరిచారు.

గతంలో ఈ టాయిలెట్‌ను న్యూయార్క్‌లోని గుగ్గెన్‌హీమ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచినప్పుడు, దానిని ఉపయోగించేందుకు లక్ష మందికి పైగా సందర్శకులు క్యూ కట్టారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కోసం వాన్ గో పెయింటింగ్‌ను అడగ్గా, మ్యూజియం వారు దానికి బదులుగా ఈ బంగారు టాయిలెట్‌ను ఆఫర్ చేశారు.

ఈ నెల‌ 8 నుంచి వేలం ముగిసే వరకు ఈ 'అమెరికా' టాయిలెట్‌ను సోత్’బీస్ ప్రధాన కార్యాలయంలోని ఒక బాత్రూంలో ప్రదర్శనకు ఉంచుతారు. సందర్శకులు దీనిని దగ్గర నుంచి చూడవచ్చు. అయితే, గతంలో లాగా దీనిని ఉపయోగించుకునే అవకాశం మాత్రం లేదు. కేవలం చూడగలరు కానీ, ఫ్లష్ చేయలేరు.
Golden Toilet
Maurizio Cattelan
America toilet
Sotheby's auction
art installation
luxury items
high value art
stolen toilet
gold art
toilet exhibit

More Telugu News