Bankim Brahmbhatt: అమెరికాలో భారత సంతతి వ్యాపారి బాగోతం.. ప్రపంచ దిగ్గజ సంస్థలకు రూ. 4,150 కోట్ల కుచ్చుటోపీ

Bankim Brahmbhatt Faces Allegations of 500 Million Dollar Fraud Against Global Firms
  • అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త బంకిమ్ బ్రహ్మభట్ భారీ రుణ మోసం
  • బ్లాక్‌రాక్ వంటి దిగ్గజ సంస్థలకు రూ. 4,150 కోట్లకు పైగా నష్టం
  • నకిలీ ఇన్వాయిస్‌లు, పత్రాలను హామీగా పెట్టి రుణాలు పొందిన వైనం
  • నకిలీ ఈ-మెయిల్ డొమైన్ల ద్వారా వెలుగులోకి వచ్చిన మోసం
  • డబ్బును భారత్, మారిషస్‌లకు తరలించినట్లు లాయర్లు ఆరోపణ
  • సంప్రదించేందుకు ప్రయత్నించగా బ్రహ్మభట్ అజ్ఞాతంలోకి
అమెరికాలో భారత సంతతికి చెందిన ఒక టెలికాం వ్యాపారవేత్త అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను నిండా ముంచారు. నకిలీ పత్రాలు, ఇన్వాయిస్‌లను సృష్టించి ఏకంగా 500 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4,150 కోట్లు) పైగా రుణం పొంది మోసానికి పాల్పడినట్లు ఆయనపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ బ్లాక్‌రాక్‌తో పాటు పలు ప్రధాన రుణ సంస్థలు ఈ మోసం బారిన పడ్డాయి.

వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) తన ప్రత్యేక కథనంలో ఈ వివరాలను వెల్లడించింది. బంకిమ్ బ్రహ్మభట్ అనే వ్యాపారవేత్త బ్రాడ్‌బ్యాండ్ టెలికాం, బ్రిడ్జ్‌వాయిస్ వంటి సంస్థలకు అధిపతి. ఆయన తన కంపెనీలు ఆర్థికంగా బలంగా ఉన్నట్లు నకిలీ ఇన్వాయిస్‌లు, ఖాతాలను సృష్టించి, వాటిని హామీగా చూపి భారీ రుణాలు పొందారని రుణ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు ఆగస్టులో అమెరికా కోర్టులో దావా వేశాయి. బ్రహ్మభట్ తన కంపెనీల ద్వారా పొందిన డబ్బును భారత్, మారిషస్‌లలోని ఆఫ్‌షోర్ ఖాతాలకు తరలించారని ఫిర్యాదులో పేర్కొన్నాయి.

మోసం వెలుగులోకి వచ్చిందిలా..
బ్లాక్‌రాక్‌కు చెందిన హెచ్‌పీఎస్ ఇన్వెస్ట్‌మెంట్ పార్టనర్స్ సంస్థ.. బ్రహ్మభట్ కంపెనీలకు 2020 నుంచి రుణాలు ఇవ్వడం ప్రారంభించింది. 2021లో 385 మిలియన్ డాలర్లుగా ఉన్న ఈ రుణం, 2024 ఆగస్టు నాటికి దాదాపు 430 మిలియన్ డాలర్లకు చేరింది.  

అయితే, 2025 జులైలో హెచ్‌పీఎస్ ఉద్యోగి ఒకరు ఇన్వాయిస్‌ల వెరిఫికేషన్ కోసం ఉపయోగించిన కస్టమర్ ఈ-మెయిల్ చిరునామాలలో కొన్ని తేడాలు గమనించారు. కొన్ని ఈ-మెయిల్స్ అసలైన టెలికాం కంపెనీలను పోలిన నకిలీ డొమైన్ల నుంచి వచ్చినట్లు గుర్తించారు. లోతుగా విచారించగా, కస్టమర్ల నుంచి వచ్చినట్లు చెబుతున్న ఉత్తరప్రత్యుత్తరాలు కూడా నకిలీవని తేలింది.

ఈ విషయంపై అధికారులు బ్రహ్మభట్‌ను ప్రశ్నించగా, ఆయన మొదట ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పి, ఆ తర్వాత ఫోన్ కాల్స్‌కు స్పందించడం మానేశారు. అనుమానంతో న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీలో ఉన్న బ్రహ్మభట్ కార్యాలయాలకు హెచ్‌పీఎస్ ఉద్యోగి వెళ్లగా, వాటికి తాళాలు వేసి ఉన్నాయి. గత కొన్ని వారాలుగా అక్కడికి సిబ్బంది ఎవరూ రావడం లేదని చుట్టుపక్కల వారు తెలిపారు. ఇదే సమయంలో బ్రహ్మభట్ నివాసం ముందు బీఎండబ్ల్యూ, పోర్షే, టెస్లా, ఆడి వంటి విలాసవంతమైన కార్లు నిలిపి ఉండటం గమనార్హం.

ఈ పరిణామాల తర్వాత హెచ్‌పీఎస్ సంస్థ.. ప్రముఖ న్యాయ సంస్థ క్విన్ ఇమ్మాన్యుయేల్‌తో పాటు అకౌంటింగ్ సంస్థ సీబీఐజెడ్‌తో సమీక్ష చేయించింది. గత రెండేళ్లుగా ఇన్వాయిస్‌ల ధ్రువీకరణ కోసం బ్రహ్మభట్ సంస్థలు అందించిన ప్రతి కస్టమర్ ఈ-మెయిల్ నకిలీదని వారి దర్యాప్తులో తేలింది. కొన్ని కాంట్రాక్టులు 2018 నుంచే ఫోర్జరీకి గురైనట్లు గుర్తించారు. కేవలం కాగితాలపై మాత్రమే ఆస్తులు ఉన్నట్లు బ్రహ్మభట్ ఒక పెద్ద బ్యాలెన్స్ షీట్‌ను సృష్టించారని రుణ సంస్థలు తమ ఫిర్యాదులో ఆరోపించాయి. ఈ భారీ మోసంపై ప్ర‌స్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
Bankim Brahmbhatt
Indian American businessman
telecom fraud
BlackRock
Wall Street Journal
fake invoices
offshore accounts
HPS Investment Partners
BridgeVoice
broadband telecom

More Telugu News