Chandrababu Naidu: అమరావతికి చంద్రబాబు అంబాసిడర్ కారు.. స్మృతులను నెమరువేసుకున్న సీఎం

Chandrababu Naidu recalls memories with Ambassador car in Amaravati
  • 30 ఏళ్ల నాటి తన అంబాసిడర్ కారును పరిశీలించిన సీఎం చంద్రబాబు
  • కారుతో ముడిపడి ఉన్న పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న టీడీపీ అధినేత
  • ఏపీ 09 జీ 393 నెంబరు గల ఈ వాహనం చంద్రబాబు సొంత కారు
  • ఉమ్మడి ఏపీ సీఎంగా ఈ కారులోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన బాబు
  • ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఉన్న కారును అమరావతికి తరలింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మూడు దశాబ్దాల నాటి అంబాసిడర్ కారును చూసి పాత జ్ఞాపకాల్లో మునిగిపోయారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన ఆయన, తిరుగు ప్రయాణంలో అక్కడ ఉంచిన తన పాత కారును ఆసక్తిగా తిలకించారు. ఆ వాహనంతో తనకున్న అనుబంధాన్ని, నాటి ప్రయాణ స్మృతులను ఆయన గుర్తు చేసుకున్నారు.

ఏపీ 09 జీ 393 రిజిస్ట్రేషన్ నెంబరుతో ఉన్న ఈ అంబాసిడర్ కారు చంద్రబాబు నాయుడు సొంత వాహనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన కాన్వాయ్‌లో ఇదే కారులో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. రాజకీయంగా కీలకమైన ఎన్నో ప్రయాణాలకు ఈ కారే సాక్ష్యంగా నిలిచింది.

ప్రస్తుతం నాల్గవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, భద్రతా కారణాల దృష్ట్యా అత్యంత ఆధునిక వాహనాలను వినియోగిస్తున్నప్పటికీ, ఈ అంబాసిడర్ కారును మాత్రం చంద్రబాబు ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. ఇన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఉన్న ఈ వాహనాన్ని తాజాగా అమరావతికి తరలించారు. ఇకపై ఈ కారును శాశ్వతంగా అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే ఉంచాలని నిర్ణయించారు.

పార్టీ కార్యాలయానికి వచ్చిన నేతలు, కార్యకర్తలు చూసేందుకు వీలుగా దీనిని ప్రదర్శనగా ఉంచనున్నారు. ఈ సందర్భంగా కారును పరిశీలించిన చంద్రబాబు, అందులో తాను చేసిన పర్యటనలను గుర్తుచేసుకుని కొంతసేపు గతాన్ని నెమరువేసుకున్నారు. 

ఆ కారు వద్ద దిగిన ఫోటోలను ఎక్స్‌లో షేర్ చేస్తూ విత్ మై ఓల్డ్ ఫ్రండ్ అంటూ చంద్రబాబు రాసుకొచ్చారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
Amaravati
TDP
Ambassador car
AP politics
Political history
Nara Chandrababu Naidu
Telugu Desam Party
AP CM

More Telugu News