Nara Bhuvaneswari: నారా భువనేశ్వరికి రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు... రేపు లండన్ వెళుతున్న సీఎం చంద్రబాబు

Nara Bhuvaneswari to Receive Two Prestigious Awards CM Chandrababu to Visit London
  • అర్ధాంగితో కలిసి సీఎం చంద్రబాబు యూకే పర్యటన
  • నారా భువనేశ్వరికి రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు
  • డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్, గోల్డెన్ పీకాక్ అవార్డులు అందుకోనున్న భువనేశ్వరి
  • నవంబర్ 4న లండన్‌లో అవార్డుల ప్రదానోత్సవం
  • పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి
  • నవంబర్ 6న తిరిగి రానున్న చంద్రబాబు దంపతులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత పర్యటన నిమిత్తం యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) వెళ్లనున్నారు. తన అర్ధాంగి, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరితో కలిసి ఆయన శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరనున్నారు. ఈ పర్యటనలో భాగంగా లండన్‌లో జరిగే కార్యక్రమంలో నారా భువనేశ్వరి రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకోనున్నారు.

నవంబర్ 4న లండన్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) సంస్థ ఓ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ వేదికపై నారా భువనేశ్వరి రెండు కీలక పురస్కారాలను స్వీకరించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ, సామాజిక సాధికారతకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆమెను 'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025' అవార్డుకు ఎంపిక చేశారు. అలాగే, 'ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్' విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు లభించిన 'గోల్డెన్ పీకాక్' అవార్డును కూడా ఎండీ హోదాలో ఆమె అందుకోనున్నారు.

గతంలో ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, పారిశ్రామికవేత్తలు గోపీచంద్ హిందూజా, రాజశ్రీ బిర్లా, దిలీప్ సంఘ్వీ, దుబాయ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ అథారిటీ ఎండీ సయీద్ మహ్మద్, హీరో ఎంటర్ ప్రైజెస్, గోయెంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయెంకా వంటి దిగ్గజ వ్యక్తులు వంటి ప్రముఖులు అందుకున్నారు. ఇప్పుడు ఆ గౌరవం భువనేశ్వరికి దక్కడం విశేషం.

ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో కూడా సమావేశం కానున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానించనున్నారు. తమ పర్యటనను ముగించుకుని చంద్రబాబు దంపతులు నవంబర్ 6న తిరిగి రాష్ట్రానికి రానున్నారు.
Nara Bhuvaneswari
Chandrababu Naidu
Heritage Foods
NTR Trust
IOD
Institute of Directors
Golden Peacock Award
Distinguished Fellowship 2025
Andhra Pradesh
UK Visit

More Telugu News