Revanth Reddy: మొంథా తుపాను కారణంగా 12 జిల్లాల్లో తీవ్ర నష్టం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy Severe damage in 12 districts due to Montha Cyclone
  • పంట నష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న రోడ్లపై నివేదికలు తెప్పించాలన్న ముఖ్యమంత్రి
  • ధనిక రాష్ట్రమని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వదులుకోమన్న రేవంత్ రెడ్డి
  • వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం
'మొంథా' తుపాను కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంట నష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న రోడ్లపై సమగ్ర నివేదికలు తెప్పించాలని, ప్రజాప్రతినిధుల వద్ద ఉన్న సమాచారాన్ని కూడా కలెక్టర్లకు అందజేయాలని సూచించారు.

అన్ని నివేదికలను క్రోడీకరించి నిర్దిష్ట నమూనాలో కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని ఆయన అన్నారు. తుపాను నష్టాల నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి కృషి చేయాలని, ఈ విషయంలో అధికారులు అలసత్వం వహించకూడదని ఆదేశించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమైనప్పటికీ, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వదులుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.

వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం అందజేస్తుందని ప్రకటిచారు. ఇళ్లు నీట మునిగిన బాధితులకు రూ. 15 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గుడిసెలు కోల్పోయిన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద గృహాలు మంజూరు చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎకరా పంట నష్టానికి రూ. 10 వేలు, ఆవులు, గేదెలు మరణిస్తే రూ. 50 వేలు, మేకలు, గొర్రెలు మరణిస్తే రూ. 5 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Revanth Reddy
Telangana Floods
Montha Cyclone
Telangana CM
Flood Relief
Telangana Rains

More Telugu News