Ruchita Jadhav: ఆ కిడ్నాపర్‌ను నేనూ కలవాల్సి ఉంది... పిల్లలను బంధించాడని తెలిసి వణికిపోయా: మరాఠీ నటి రుచితా జాదవ్

Ruchita Jadhav Marathi Actress Recalls Close Encounter with Mumbai Kidnapper
  • ముంబై ఆర్ఏ స్టూడియోలో చిన్నారులను బంధించిన ఘటన
  • పిల్లలను బంధించడానికి రెండు రోజులు ముందు కలవాల్సిందన్న రుచిత
  • అనివార్య కారణాల వల్ల వెళ్లలేకపోయినట్లు వెల్లడి
ముంబైలో చిన్నారులను బంధించిన రోహిత్ ఆర్యను అంతకు రెండు రోజుల ముందు తాను కూడా కలవాల్సి ఉందని, అనివార్య కారణాల వల్ల కలవలేకపోయానని, ఉదయం మీడియాలో అతడి గురించి వార్త చూడగానే వణికిపోయానని మరాఠా నటి రుచితా విజయ్ జాదవ్ అన్నారు. రెండు రోజుల క్రితం ముంబైలోని ఆర్ఏ స్టూడియోలో పట్టపగలే చిన్నారులను బంధించిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆమె స్పందించారు.

పిల్లలను బంధించడానికి రెండు రోజుల ముందు తాను కిడ్నాపర్ రోహిత్ ఆర్యను కలవాల్సి ఉందని అన్నారు. చివరి నిమిషంలో తాను వెళ్లకపోవడంతో అతని నుంచి తప్పించుకున్నానని అన్నారు. తనకు రోహిత్ ఆర్య నిర్మాతగా పరిచయమయ్యాడని, బంధించడం నేపథ్యంలో ఒక సినిమా తీయనున్నట్లు చెప్పాడని అన్నారు. ప్రాజెక్టు, కథ గురించి మాట్లాడేందుకు రావాలని తనకు చెప్పడంతో అంగీకరించానని అన్నారు.

అక్టోబర్ 23న తనకు మెసేజ్ చేసి, అపాయింట్‌మెంట్ కోరడంతో 28వ తేదీన కలుస్తానని చెప్పానని ఆమె తెలిపారు. అక్టోబర్ 27న తనకు పవయీ ప్రాంతంలోని ఆర్ఏ స్టూడియో చిరునామాను, లొకేషన్ వాట్సాప్ చేశాడని చెప్పారు. కొన్ని కారణాల వల్ల తాను చివరి నిమిషంలో వెళ్లలేకపోయానని రుచిత వెల్లడించారు. పిల్లలను కిడ్నాప్ చేసినట్లు తాను మరుసటి రోజు ఉదయం మీడియాలో వార్త చూసి వణికిపోయానని, రెండు రోజుల క్రితం తాను కలవాల్సిన అదే వ్యక్తి, పిల్లలను బంధించాడని తెలిసి ఆశ్చర్యపోయానని అన్నారు.

ఆ రోజు ఏదో శక్తి తనను కాపాడిందని, అందుకు భగవంతుడికి, మా కుటుంబ సభ్యులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. ఈ ఘటనతో తాను ఓ విషయం తెలుసుకున్నానని, కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకునే ముందు జాగ్రత్త చాలా అవసరమని గుర్తించానని అన్నారు. మీరు ఎక్కడకు వెళుతున్నారు, ఏం చేస్తున్నారనే విషయాలను కుటుంబ సభ్యులతో పంచుకోవాలని సూచించారు.
Ruchita Jadhav
Marathi actress
Rohit Arya
Mumbai kidnapping
RA studio
child abduction
film producer

More Telugu News