Digital Arrest Scam: హైదరాబాద్‌లో ‘డిజిటల్ అరెస్ట్’ మోసం.. వృద్ధుడిని బెదిరించి రూ.51 లక్షల స్వాహా!

Digital Arrest Scam Hyderabad Elderly Man Loses 51 Lakhs
  • రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.51 లక్షల వసూలు
  • బాంబు పేలుళ్ల కేసులో ఇరికిస్తామని బెదిరించిన సైబర్ నేరగాళ్లు
  • వీడియో కాల్ చేసి బాధితుడిని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేసిన వైనం
  • నగరంలో ఈ వారంలో ఇది రెండో అతిపెద్ద సైబర్ మోసం
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న పోలీసులు
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. 'డిజిటల్ అరెస్ట్' పేరుతో అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా శ్రీనగర్ కాలనీకి చెందిన 78 ఏళ్ల రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వీరి వలలో చిక్కి రూ.51 లక్షలు పోగొట్టుకున్నారు.

అస‌లేం జ‌రిగిందంటే..!
బాధితుడికి కొన్ని రోజుల క్రితం ఒక అపరిచిత నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ ఏసీపీనని పరిచయం చేసుకున్నాడు. బాధితుడి మొబైల్ సిమ్ కార్డును బాంబు పేలుళ్లు, కిడ్నాప్ కేసుల్లో వాడారని, అతని పేరు మీద ఇతరులు మరికొన్ని సిమ్ కార్డులు తీసుకున్నారని నమ్మబలికాడు. అంతేకాకుండా మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయంటూ సీబీఐ పేరుతో ఉన్న నకిలీ నోటీసులను కూడా చూపించి తీవ్రంగా బెదిరించాడు.

ఆ తర్వాత బాధితుడిని వీడియో కాల్ ద్వారా 'డిజిటల్ అరెస్ట్' చేశారు. ఎవరితోనూ మాట్లాడకుండా, బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. కేసు నుంచి బయటపడాలంటే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులో 95 శాతం బదిలీ చేయాలని, విచారణ పూర్తయ్యాక ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. తీవ్ర భయాందోళనలకు గురైన బాధితుడు, వారు చెప్పిన ఖాతాలకు రూ.51 లక్షలు బదిలీ చేశాడు. కొద్దిసేపటి తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నగరంలో ఈ వారంలో ఇలాంటి తరహాలో జరిగిన రెండో భారీ మోసం ఇది. కొన్ని రోజుల క్రితమే, 73 ఏళ్ల వృద్ధురాలిని సైబర్ నేరగాళ్లు ఇదే పద్ధతిలో రూ.1.43 కోట్లు మోసం చేశారు. చైల్డ్ ట్రాఫికింగ్, హత్య కేసుల్లో నిందితుడి వద్ద ఆమె ఆధార్ కార్డు దొరికిందని, అరెస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు కాజేశారు.

ఇటీవల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని కొందరు డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అపరిచిత వ్యక్తులు అధికారులుగా చెప్పుకుని ఫోన్లు చేస్తే నమ్మవద్దని, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.
Digital Arrest Scam
Hyderabad Cyber Crime
Cyber Fraud
Money Laundering
VC Sajjanar
Mumbai Crime Branch
Fake CBI Notice
Online Scam
Srinagar Colony
Telangana Police

More Telugu News