పాకిస్థాన్ వ్యోమగామిని గగనతలంలోకి తీసుకెళ్లనున్న చైనా

  • చైనాకు చెందిన మానవ సహిత అంతరిక్ష కేంద్రం కీలక ప్రకటన
  • పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యోమగాములకు శిక్షణ ఇవ్వనున్న చైనా
  • ఒకరిని పెలోడ్ స్పెషలిస్ట్‌గా స్వల్పకాలిక అంతరిక్ష ప్రయాణ మిషన్‌లో పాల్గొనేందుకు ఎంపిక చేస్తామని వెల్లడి
పాకిస్థాన్ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపేందుకు చైనా సన్నద్ధమవుతోంది. ఈ మేరకు చైనా మానవ సహిత అంతరిక్ష కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ దేశ వ్యోమగాములతో కలిసి పాకిస్థాన్ వ్యోమగామిని అంతరిక్షంలోకి తీసుకు వెళ్ళనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యోమగాములకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది.

పాకిస్థాన్ అంతరిక్ష కేంద్రం ఎంపిక చేసిన ఇద్దరు వ్యోమగాములు చైనా వ్యోమగాములతో కలిసి శిక్షణ తీసుకుంటారని ప్రతినిధి జాంగ్ జింగ్బో తెలిపారు. వారిలో ఒకరిని పెలోడ్ స్పెషలిస్ట్‌గా స్వల్పకాలిక అంతరిక్ష ప్రయాణ మిషన్‌లో పాల్గొనేందుకు ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఆ మిషన్ సమయంలో పాక్ వ్యోమగామి శాస్త్రీయ ప్రయోగాలతో పాటు సాంకేతిక ప్రదర్శనలకు సంబంధించి చైనా వ్యోమగాములకు సహాయం అందిస్తారని ఆయన వివరించారు.

2030 నాటికి చంద్రుడిపైకి తమ వ్యోమగామిని దింపేందుకు సిద్ధంగా ఉన్నామని జింగ్బో పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో అగ్రగామిగా ఉండాలనే లక్ష్యంతో ఈ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వ్యోమగాముల బృందాన్ని త్వరలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.


More Telugu News