Ajmal Ameer: అతను అలాంటివాడే: అజ్మల్‌పై హీరోయిన్ నర్విని షాకింగ్ కామెంట్స్

Actress Narvini Dheri Accuses Tamil Actor Ajmal of Misconduct
  • ఆడిషన్ పేరుతో అజ్మల్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడన్న నర్విని
  • 2018లోనే ఈ ఘటన జరిగిందని వెల్లడి
  • అతని నిజ స్వరూపం బయటపెట్టేందుకే మాట్లాడుతున్నానన్న నటి
తమిళ నటుడు అజ్మల్ అమీర్‌ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఆయన అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడినట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఆ ఆరోపణలను అజ్మల్ తీవ్రంగా ఖండించారు. అది తన కెరీర్‌ను దెబ్బతీసేందుకు సృష్టించిన ఏఐ ఫేక్ వీడియో అని కొట్టిపారేశారు. ఈ వివాదం సద్దుమణుగుతోందనుకుంటున్న తరుణంలో, తమిళ నటి నర్విని దేరి మీడియా ముందుకు వచ్చి అజ్మల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. "అజ్మల్ అలాంటి వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు" అంటూ ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

నర్విని దేరి మాట్లాడుతూ, "2018లో చెన్నైలోని ఓ మాల్‌లో అజ్మల్‌ను మొదటిసారి కలిశాను. తన తర్వాతి సినిమాలో హీరోయిన్ కోసం చూస్తున్నానని చెప్పి నా ఫోన్ నంబర్ తీసుకున్నారు. మరుసటి రోజు ఆడిషన్‌కు రమ్మని పిలిచారు. నాకు డెన్మార్క్ వెళ్లాల్సి ఉందని చెప్పినా, ఒప్పించి రమ్మన్నారు. అక్కడికి వెళ్లాక వాతావరణం తేడాగా అనిపించింది. రూమ్‌లో ఆయన ఒక్కరే ఉన్నారు. మిగతా వాళ్లెవరూ లేరా అని అడిగితే, బయటకు వెళ్లారని చెప్పారు. అప్పుడే నాకు ఏదో తప్పు జరగబోతోందని అర్థమైంది" అని వివరించారు.

ఆ తర్వాత జరిగిన సంఘటనను వివరిస్తూ, "మాటల మధ్యలో నా చేయి పట్టుకుని డ్యాన్స్ చేద్దామని అడిగారు. నేను వెంటనే తిరస్కరించి, 'మీ ఉద్దేశం నాకు అర్థమైంది, నేను దానికోసం ఇక్కడికి రాలేదు' అని స్పష్టంగా చెప్పాను. అయినా ఆయన ఏమాత్రం తగ్గకుండా 'నా వెనకాల ఎంతో మంది అమ్మాయిలు పడతారు' అంటూ గొప్పలు చెప్పుకున్నారు. అదృష్టవశాత్తు ఆయనకు ఓ ఫోన్ కాల్ రావడంతో నేను అక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డాను" అని తెలిపారు.

అప్పట్లో ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. "ఆ సమయంలో నా చదువు, కెరీర్‌పై దృష్టి పెట్టాల్సి వచ్చింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ ఇప్పుడు ఆయన నిజ స్వరూపం అందరికీ తెలియాలి. నాకు జరిగినట్లు మరో అమ్మాయికి జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ విషయాలు బయటపెడుతున్నాను" అని నర్విని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నర్విని చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అజ్మల్ వివాదం మరింత ముదిరింది.
Ajmal Ameer
Ajmal
Narvini Dheri
Tamil actor
sexual harassment allegations
fake video controversy
Chennai mall
audition experience
Kollywood
Tamil actress

More Telugu News