Anagani Satya Prasad: పంట నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు రూ. 25 వేల పరిహారం: మంత్రి అనగాని

Anagani Satya Prasad on Compensation for Cyclone Affected Farmers
  • మొంథా తుఫాన్ నష్టంపై రేపల్లెలో మంత్రి అనగాని సమీక్ష
  • తుఫాన్ నష్టాన్ని తగ్గించడం చారిత్రాత్మకమని వెల్లడి
  • విపత్తు సమయంలో వైసీపీ నేతలు కనిపించలేదని విమర్శ
మొంథా తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, హెక్టార్‌కు రూ. 25 వేల వరకు పరిహారం అందించే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేపల్లెలోని మున్సిపల్ కార్యాలయంలో తుఫాన్ వరద ప్రభావంపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పంట నష్టానికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారని వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ.. "కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎదురైన మొంథా తుపాను ప్రభావాన్ని తగ్గించడానికి చేసిన కృషి ఒక చరిత్ర. గత ఆరు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ మైక్రో లెవల్‌లో పరిస్థితిని పర్యవేక్షించారు. వారి కృషితోనే ప్రాణ, ఆస్తి నష్టాన్ని పెద్ద ఎత్తున నివారించగలిగాం. అనివార్య కారణాలతో ఇద్దరు మరణించడం బాధాకరం" అని అన్నారు.

తుపాను సహాయక చర్యల్లో కూటమి పార్టీల నేతలు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాల్గొన్నారని, అయితే విపత్తు సమయంలో వైసీపీ నేతలు ఎక్కడా కనిపించలేదని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తుపాను ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి బాధితులను పరామర్శించారని, కానీ గత ముఖ్యమంత్రి మాత్రం ఓ స్టేజీ ఏర్పాటు చేసి బాధితులను తన వద్దకే రప్పించుకున్నారని విమర్శించారు.

తుపాను వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారిని, మత్స్యకారులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. మత్స్యకారులకు అదనపు సహాయం అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న సహాయం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
Anagani Satya Prasad
Cyclone Montha
Andhra Pradesh Floods
Rayapalle
Crop Damage Compensation
Chandrababu Naidu
Pawan Kalyan
Nara Lokesh
AP Government Relief
Fishermen Support

More Telugu News