Rakesh Reddy: మంత్రులు జూబ్లీహిల్స్‌లో.. వరంగల్ నీళ్లలో: బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి

Rakesh Reddy slams ministers for Jubilee Hills while Warangal drowns
  • వరంగల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు, వరదలు
  • నీట మునిగిన కాలనీల్లో బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి పర్యటన
  • మంత్రులు జూబ్లీహిల్స్‌లో ఊరేగుతున్నారంటూ ప్రభుత్వంపై విమర్శ
  • అధికారుల నిర్లక్ష్యం వల్లే తీవ్ర నష్టం జరిగిందని ఆరోపణ
  • బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
భారీ వర్షాలతో వరంగల్ నగరం నీట మునుగుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఊరేగడం సరికాదని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి గానీ, ప్రజలు ఆపదలో ఉంటే రావా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. హనుమకొండలోని జులైవాడ, అమరావతి నగర్, సమ్మయ్య నగర్, 100 ఫీట్ రోడ్డు తదితర జలమయమైన ప్రాంతాల్లో ఆయన గ్రేటర్ వరంగల్ అధికారులతో కలిసి పర్యటించి, వరద పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ... "మొంథా తుఫాన్ కారణంగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజల ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసరాలు, టీవీలు, బీరువాల వంటి విలువైన వస్తువులు నాశనమయ్యాయి. వృద్ధులు, వికలాంగులు, బాలింతలు రాత్రంతా నీళ్లలోనే గడపాల్సి రావడం దారుణం" అని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాన్ తీవ్రతను ముందస్తుగా అంచనా వేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆయన ఆరోపించారు.

సమ్మయ్య నగర్‌లో పశువులు, గేదెలు వరద ఉద్ధృతికి కొట్టుకుపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఆస్తి నష్టంతో పాటు పశుపక్షాదుల ప్రాణ నష్టం కూడా భారీగా ఉండే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని మండిపడ్డారు. 

"వరద సమయంలో మంత్రులు జిల్లాలకు ఇన్‌చార్జులుగా ఉండి ప్రజలకు అండగా నిలవాలి. కానీ, జూబ్లీహిల్స్‌లో డివిజన్లకు ఇన్‌చార్జులుగా వ్యవహరించడం విడ్డూరంగా ఉంది" అని ఆయన ఎద్దేవా చేశారు. వెంటనే వరద ముంపు ప్రాంతాల్లో ఆస్తి నష్టాన్ని అంచనా వేసి, బాధితులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
Rakesh Reddy
Warangal floods
Telangana rains
BRS leader
Jubilee Hills
Montha cyclone
Flood relief
Greater Warangal
Telangana government
Loss compensation

More Telugu News