Telangana High Court: మద్యం తాగాడని చెప్పేందుకు బ్రీత్ ఎనలైజర్ ఒక్కటే ఆధారం కాదు.. తెలంగాణ హైకోర్టు

Telangana High Court Says Breathalyzer Not Sole Proof of Drunk Driving
  • నిర్ధారణ కోసం రక్త, మూత్ర పరీక్షలు తప్పనిసరన్న కోర్టు
  • టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్ తొలగింపు కేసులో ఈ వ్యాఖ్యలు
  • కేవలం బ్రీత్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగిని తొలగించడం చెల్లదని తీర్పు
  • ఇది ప్రాథమిక ఆధారమే కానీ తుది రుజువు కాదని వెల్లడి
బ్రీత్ ఎనలైజర్ (శ్వాస పరీక్ష) పరీక్షలో మద్యం తాగినట్టు తేలినంత మాత్రాన దానిని తుది నిర్ధారణగా పరిగణించలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం ఈ ఒక్క పరీక్ష ఆధారంగా ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం చెల్లదని బుధవారం కీలక తీర్పు వెలువరించింది. బ్రీత్ టెస్ట్ ఫలితాలను నిర్ధారించేందుకు తప్పనిసరిగా రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించాలని తేల్చి చెప్పింది.

టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్ ఎ. వెంకటి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ నమవరపు రాజేశ్వర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా మధిర డిపోలో పనిచేస్తున్న వెంకటి, మద్యం తాగి డిపో వద్ద నిరసనలో పాల్గొన్నారని ఆరోపిస్తూ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అతడిని విధుల నుంచి తొలగించింది. అతడి చర్యల వల్ల ఆర్టీసీకి రూ.18,532 నష్టం వాటిల్లిందని, సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఆర్టీసీ వాదించింది.

విచారణలో, బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో వెంకటికి 329 ఎంజీ/100 ఎంఎల్ రీడింగ్ నమోదైందని, ఇది మద్యం తాగినట్టు చెప్పడానికి ప్రత్యక్ష, శాస్త్రీయ ఆధారమని ఆర్టీసీ తరఫు న్యాయవాది వాదించారు. అందుకే క్రమశిక్షణ చర్యలు సరైనవేనని సమర్థించుకున్నారు. అయితే, ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు.

ఇలాంటి కేసులోనే 2015లో హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ రాజేశ్వర్ రావు ప్రస్తావించారు. రక్త, మూత్ర పరీక్షల వంటి నిర్ధారణ పరీక్షలు లేకుండా కేవలం బ్రీత్ ఎనలైజర్ నివేదిక ఆధారంగా మద్యం తాగినట్టు రుజువు చేయలేమని ఆయన స్పష్టం చేశారు. కేవలం శ్వాస పరీక్ష నివేదికను ఆధారం చేసుకుని పిటిషనర్‌ను ఉద్యోగం నుంచి తొలగించడం నిలవదని కోర్టు పేర్కొంది. బ్రీత్ ఎనలైజర్ నివేదికలు కేవలం ప్రాథమిక ఆధారంగా మాత్రమే ఉపయోగపడతాయని, తదుపరి వైద్య పరీక్షలకు మార్గం సుగమం చేస్తాయని స్పష్టం చేసింది. 
Telangana High Court
Breathalyzer test
drunk driving
TSRTC
blood test
urine test
Justice N Rajeswar Rao
excise laws
alcohol consumption
breath analyzer

More Telugu News