Mumbai Traffic Police: ట్రాఫిక్ పోలీసులపై యువకుడి రివెంజ్ మామూలుగా లేదు.. వీడియో ఇదిగో!

Traffic Police Fined 2000 Rupees After Mumbai Viral Video
  • హెల్మెట్ లేదని యువకుడికి రూ. వెయ్యి ఫైన్ వేసిన ట్రాఫిక్ సిబ్బంది
  • నెంబర్ ప్లేట్ సరిగా లేని స్కూటర్ పై వెళుతున్న ట్రాఫిక్ పోలీసులను వెంటాడి పట్టుకున్న యువకుడు
  • స్కూటర్ యజమానికి రూ.2 వేలు ఫైన్ విధించిన ఉన్నతాధికారులు
మహారాష్ట్రలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించాడో యువకుడు.. హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణించినందుకు తనకు రూ.వెయ్యి ఫైన్ వేశారన్న కోపంతో ఉన్న ఆ యువకుడు.. నెంబర్ ప్లేట్ సరిగా లేని స్కూటర్ పై ప్రయాణిస్తున్న ట్రాఫిక్ పోలీసులను వెంటాడి పట్టుకుని డబుల్ ఫైన్ విధించేలా చేశాడు. స్కూటర్ ను వెనక నుంచి పట్టుకుని ఆపేందుకు ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తోంది.

ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ యువకుడి ధైర్యానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. వైరల్ గా మారిన ఈ వీడియోపై డిప్యూటీ కమిషనర్ (ట్రాఫిక్) పంకజ్ సిర్సాత్ స్పందించారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బందిని అలా ప్రమాదకరంగా ఆపడం, గొడవపడడం సరికాదన్నారు.

ఓ ఫొటో తీసి ఆన్ లైన్ లో ఫిర్యాదు చేస్తే సరిపోతుందని హితవు పలికారు. ట్రాఫిక్ సిబ్బంది ప్రయాణించిన స్కూటర్ వారిది కాదని, వారి స్నేహితుడిదని వివరణ ఇచ్చారు. స్కూటర్ కు ముందు వైపు నెంబర్ ప్లేట్ సరిగా లేదని, మిర్రర్ లేదని గుర్తించామన్నారు. నిబంధనల ప్రకారం ఆ స్కూటర్ యజమానికి రూ.2 వేల జరిమానా విధించామని సిర్సాత్ మీడియాకు వివరణ ఇచ్చారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి ట్రాఫిక్ సిబ్బంది పేర్లు, ఇతర వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.
Mumbai Traffic Police
Mumbai
Traffic Police
Maharashtra
Viral Video
Traffic Fine
Road Safety
Pankaj Sirsath

More Telugu News