Veera Brahmendra Swamy: కూలిపోయిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు

Veera Brahmendra Swamys 350 Year Old House Collapses
  • కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో కూలిన వీరబ్రహ్మేంద్ర స్వామి గృహం
  • వరుస వర్షాల కారణంగా శిథిలమై కూలిపోయిన కట్టడం
  • 350 ఏళ్ల నాటి చారిత్రక భవనంగా గుర్తింపు
కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠంలో అపశ్రుతి చోటుచేసుకుంది. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వారు నివసించిన 350 ఏళ్ల నాటి చారిత్రక గృహం కుప్పకూలింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భవనం గోడలు పూర్తిగా నానిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో ఆ భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

విషయం తెలుసుకున్న పూర్వ మఠాధిపతి కుమారులు వెంకటాద్రిస్వామి, వీరంభట్లయ్య స్వామి, దత్తాత్రేయస్వామి ఘటనా స్థలానికి చేరుకుని, కూలిపోయిన భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ మిద్దె అత్యంత పురాతనమైనదని, చారిత్రక ప్రాధాన్యం ఉన్నదని తెలిపారు. వరుస వర్షాల కారణంగా భవనం బలహీనపడి ఒకవైపుగా కూలిపోయిందని వివరించారు.

ఈ చారిత్రక కట్టడాన్ని పునర్‌ నిర్మించడానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని వారు వెల్లడించారు. వీలైనంత త్వరగా పునర్‌ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు,, ఈ ఘటన పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
Veera Brahmendra Swamy
Brahamgari Matham
Kadapa District
Historical house collapse
Andhra Pradesh temples
Pothuluru
Venkataadri Swamy
Veerambhatlaiah Swamy
Dattaatreya Swamy
Temple renovation

More Telugu News