Darshan: డెలివరీ బాయ్ ను వెంటాడి కారుతో ఢీ కొట్టి చంపిన దంపతులు.. వీడియో ఇదిగో!

Darshan Delivery Boy Killed by Couple in Bengaluru Road Rage
  • బెంగళూరులో ఘోరం.. సైడ్ మిర్రర్ కు బైక్ తాకడంతో గొడవ
  • 2 కి.మీ. వెంటాడి బైక్ ను ఢీ కొట్టి వెళ్లిన దంపతులు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డెలివరీ బాయ్ మృతి
కారులో వెళుతుండగా బైక్ పై వచ్చిన యువకుడు పొరపాటున సైడ్ మిర్రర్ ను తాకుతూ వెళ్లాడు. దీంతో బైకర్ కు, కారులోని దంపతులకు గొడవ జరిగింది. కొద్దిసేపటి తర్వాత బైకర్ వెళ్లిపోగా.. కారులోని దంపతులు మాత్రం వెంటాడి మరీ బైకర్ ను ఢీ కొట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. బెంగళూరులో చోటుచేసుకుందీ దారుణం. వివరాల్లోకి వెళితే..

బెంగళూరుకు చెందిన డెలివరీ బాయ్ దర్శన్‌ ఈ నెల 22న అర్ధరాత్రి తన స్నేహితుడు వరుణ్‌తో కలిసి శ్రీరామ లేఅవుట్లో బైక్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ కారు పక్క నుంచి వెళుతుండగా సైడు మిర్రర్‌ కు బైక్ తగిలింది. దీంతో కారులో ఉన్న మనోజ్‌ కుమార్, ఆయన భార్య ఆరతి శర్మ బైకుపై ఉన్న దర్శన్ తో గొడవకు దిగారు. కొద్దిసేపటి తర్వాత దర్శన్ అక్కడి నుంచి వెళ్లిపోగా.. మనోజ్, ఆరతి కారులో వెంటాడారు. దాదాపు 2 కి.మీ. వెంటాడి బైక్ ను వెనక నుంచి ఢీ కొట్టారు.

బైక్ కు తగిలి కారు ముందు భాగంలో కొన్ని పార్టులు ప్రమాదస్థలంలో పడిపోగా.. మనోజ్, ఆరతి మాస్కులు ధరించి వెనక్కి వచ్చి వాటిని పట్టుకెళ్లారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దర్శన్, వరుణ్‌ లను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ దర్శన్‌ చనిపోగా.. వరుణ్‌ కోలుకుంటున్నాడు. వరుణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా మనోజ్, ఆరతిల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. దీంతో జేపీనగర పోలీసులు మనోజ్, ఆరతిలను బుధవారం అరెస్టు చేశారు.
Darshan
Bengaluru
Delivery boy
Road accident
Manoj Kumar
Arathi Sharma
Bike accident
Crime news
JP Nagar police
CCTV footage

More Telugu News