MK Stalin: స్టాలిన్ సర్కార్‌ను కుదిపేస్తున్న జాబ్ స్కామ్.. రంగంలోకి ఈడీ!

MK Stalin Government Faces Job Scam Allegations ED Investigates
  • తమిళనాడు మున్సిపల్ శాఖలో భారీ ఉద్యోగ కుంభకోణం
  • ఒక్కో పోస్టుకు రూ. 25 నుంచి రూ. 35 లక్షల వరకు లంచాలు
  • మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో స్కాంను గుర్తించిన ఈడీ
  • దర్యాప్తు చేపట్టాలని తమిళనాడు పోలీసులకు ఈడీ లేఖ
  • పలువురు రాజకీయ ప్రముఖుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు
  • వచ్చే ఎన్నికల వేళ స్టాలిన్ సర్కార్‌కు కొత్త తలనొప్పి
తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, నీటి సరఫరా విభాగంలో ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి రూ. 25 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకు లంచాలు తీసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది.

ఓ మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో ఈ ‘క్యాష్ ఫర్ జాబ్’ స్కామ్ బయటపడగా, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులకు ఈడీ తాజాగా లేఖ రాసింది. ఈ కుంభకోణం వెనుక కొందరు శక్తిమంతమైన రాజకీయ నాయకులు, ప్రముఖులు ఉన్నారని ఈడీ ఆరోపిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, నీటి సరఫరా విభాగంలో అసిస్టెంట్ ఇంజినీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, జూనియర్ ఇంజినీర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వంటి పోస్టుల భర్తీకి 2024లో ప్రక్రియ ప్రారంభమైంది. సుమారు 1.12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షల అనంతరం 2,538 మందిని ఎంపిక చేశారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో స్వయంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వీరికి నియామక పత్రాలు అందజేశారు.

అయితే, ఈ నియామక ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది. దాదాపు 150 మంది అభ్యర్థులకు అనుకూలంగా పరీక్షల్లో రిగ్గింగ్‌కు పాల్పడినట్లు పేర్కొంది. ఇందుకోసం అభ్యర్థుల నుంచి రూ. 25-35 లక్షల చొప్పున వసూలు చేశారని తెలిపింది. ఈ కుంభకోణంలో రాష్ట్రంలోని కీలక రాజకీయ నాయకులు, కొన్ని సంస్థల ప్రమేయం ఉందని ఈడీ అనుమానిస్తోంది. ఈ ఆరోపణలకు సంబంధించి 232 పేజీల ఆధారాలను తమిళనాడు పోలీసులకు సమర్పించింది. ఈ పరీక్షను నిర్వహించిన అన్నా యూనివర్సిటీపైనా దర్యాప్తు జరపాలని కోరినట్లు సమాచారం.

ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఈ వార్తా కథనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. అయితే, ఈ ఆరోపణలపై తమిళనాడు ప్రభుత్వం గానీ, సీఎం స్టాలిన్ గానీ ఇప్పటివరకు స్పందించలేదు. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కుంభకోణం అధికార డీఎంకే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
MK Stalin
Tamil Nadu job scam
Stalin government
ED investigation
cash for jobs
municipal administration
Anna University
Tamil Nadu politics
DMK government
Tamilaga Vettri Kazhagam

More Telugu News