Bhatti Vikramarka: హైదరాబాదులో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్

Bhatti Vikramarka Inaugurates McDonalds Global Capability Center in Hyderabad
  • అమెరికా తర్వాత ఇదే అతిపెద్ద మెక్‌డొనాల్డ్స్ కార్యాలయం
  • తెలంగాణ ప్రతిభ, పాలనపై నమ్మకానికి ఇది నిదర్శనమన్న భట్టి
  • పరిశ్రమలకు తెలంగాణలో అనుకూల వాతావరణం ఉందన్న శ్రీధర్ బాబు
  • గ్లోబల్ కేపేబిలటీ సెంటర్లకు రాజధానిగా ఎదుగుతున్న హైదరాబాద్
  • మారియట్ సంస్థ కూడా జీసీసీ కోసం హైదరాబాద్‌ను ఎంచుకుందని వెల్లడి
హైదరాబాద్ మహానగరం గ్లోబల్ కేపేబిలటీ సెంటర్ల (జీసీసీ)కు రాజధానిగా నిలుస్తోందని, దీనికి నిదర్శనమే అంతర్జాతీయ ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ తమ గ్లోబల్ ఆఫీస్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడమని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రతిభపై విశ్వాసం, ప్రభుత్వ పాలనపై నమ్మకంతోనే ఇలాంటి సంస్థలు తరలివస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. బుధవారం హైటెక్ సిటీలో 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్‌ను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. అమెరికా వెలుపల మెక్‌డొనాల్డ్స్ సంస్థ ఏర్పాటు చేసిన అతిపెద్ద కార్యాలయం ఇదే కావడం విశేషం.
 
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మాజీ ప్రధానులు నెహ్రూ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి నేతల దూరదృష్టితో చేపట్టిన సంస్కరణల ఫలితంగానే హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదిగిందని గుర్తుచేశారు. ఒకప్పుడు మినార్లు, సరస్సులతో చారిత్రక నగరంగా ఉన్న హైదరాబాద్.. ఇప్పుడు డేటా, డిజైన్ రంగాల్లో గ్లోబల్ హబ్‌గా మారిందన్నారు.
 
పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో అత్యంత అనువైన వాతావరణం ఉందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, అందుబాటులో ఉన్న నైపుణ్యం కలిగిన మానవ వనరుల వల్లే అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయన్నారు. కేవలం టెక్నాలజీ కంపెనీలే కాకుండా, అన్ని రంగాలకు చెందిన సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని వివరించారు. ప్రముఖ ఆతిథ్య రంగ సంస్థ ‘మారియట్’ కూడా తన మొదటి జీసీసీని ప్రారంభించేందుకు హైదరాబాద్‌నే ఎంచుకుందని ఆయన గుర్తుచేశారు. ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగంగా మెక్‌డొనాల్డ్స్ వంటి గ్లోబల్ సంస్థలతో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
Bhatti Vikramarka
McDonalds
McDonalds Global Capability Center
Hyderabad
Telangana
Sridhar Babu
GCC
Global Capability Center
IT Industry
Food Industry

More Telugu News