Maoists: బీజాపూర్ జిల్లాలో 51 మంది మావోయిస్టుల లొంగుబాటు

51 Maoists Surrender in Bijapur District
  • మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ
  • అగ్రనేతల లొంగుబాటు తర్వాత పెరుగుతున్న సంఖ్య
  • ఆపరేషన్ కగార్ విజయవంతంతో మారుతున్న పరిస్థితులు
  • జనజీవన స్రవంతిలోకి వస్తున్న మావోయిస్టులు
మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో నిన్న ఒక్కరోజే ఏకంగా 72 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్, కంకేర్ జిల్లాల్లో వీరు పోలీసుల ఎదుట ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. ఇది ఇటీవల కాలంలో అతిపెద్ద లొంగుబాటు ఘటనల్లో ఒకటిగా నిలిచింది. 

వివరాల్లోకి వెళ్తే, బీజాపూర్ జిల్లాలో 9 మంది మహిళలు సహా 51 మంది మావోయిస్టులు లొంగిపోగా, కంకేర్ జిల్లాలో మరో 21 మంది పోలీసులకు సరెండర్ అయ్యారు. గత కొన్ని రోజులుగా ఈ లొంగుబాట్ల పరంపర కొనసాగుతోంది.  తెలంగాణకు చెందిన కీలక నేతలు పుల్లూరు ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న, బండి ప్రకాష్‌లు తెలంగాణ ఎస్‌ఐబీ చేపట్టిన ఆపరేషన్‌లో లొంగిపోయిన విషయం తెలిసిందే.

కొద్ది రోజుల క్రితం మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్, తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న వంటి వారు లొంగిపోయిన తర్వాత కిందిస్థాయి కేడర్‌లో కదలిక వచ్చింది. కేంద్ర బలగాలు ప్రారంభించిన 'ఆపరేషన్ కగార్' ఈ పరిణామాలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.

దండకారణ్యంలో పరిస్థితులు అనుకూలంగా మారాయని భావించిన వెంటనే, ఈ ఏడాది జనవరిలో కేంద్ర బలగాలు 'ఆపరేషన్ కగార్‌'ను ప్రారంభించాయి. కచ్చితమైన మానవ, సాంకేతిక నిఘాతో మావోయిస్టుల కదలికలపై దాడులు చేయడంతో ప్రతీ ఎన్‌కౌంటర్‌లోనూ మావోయిస్టులు భారీగా నష్టపోయారు. దీంతో పార్టీలోని ఓ వర్గం సాయుధ పోరాటానికి స్వస్తి పలికి లొంగుబాటు బాట పట్టింది. మారుతున్న పరిస్థితులు, భద్రతా బలగాల వ్యూహాల నేపథ్యంలో మావోయిస్టులు లొంగిపోక తప్పనిసరి పరిస్థితి నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Maoists
Bijapur
Chhattisgarh
Surrender
Naxalites
Kanker
Operation Kagar
Telangana SIB
Pulluru Prasad Rao
Bandi Prakash

More Telugu News