Cyclone Montha: మొంథా ప్రభావంతో తెలంగాణకు భారీ వర్ష సూచన.. నాగర్ కర్నూలు జిల్లాలో కోతకు గురైన జాతీయ రహదారి

Cyclone Montha impact heavy rain forecast for Telangana
  • వాయుగుండంగా బలహీనపడిన మొంథా తుపాను
  • భద్రాచలానికి 50 కి.మీ, ఖమ్మంకు 110 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం
  • తెలంగాణలోని ఒకటి రెండు ప్రాంతాల్లో ఆకస్మిక వరద హెచ్చరిక
  • నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలో కోతకు గురైన జాతీయ రహదారి
మొంథా తుపాను వాయుగుండంగా బలహీనపడటంతో తెలంగాణపై దీని ప్రభావం కొనసాగుతోంది. భద్రాచలానికి 50 కి.మీ., ఖమ్మంకు 110 కి.మీ., ఒడిశాలోని మల్కన్‌గిరికి 130 కి.మీ. దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. గడిచిన ఆరు గంటలుగా వాయుగుండం 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.

ఉత్తర వాయవ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా రాగల 12 గంటల్లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలోని ఒకటి రెండు ప్రాంతాల్లో ఆకస్మిక వరద హెచ్చరికలను విశాఖ వాతావరణ కేంద్రం జారీ చేసింది.

కోతకు గురైన జాతీయ రహదారి

నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లతిపుర్ సమీపంలో డిండి జలాశయం మత్తడి దుంకుతోంది. దీంతో జాతీయ రహదారి కోతకు గురి కావడంతో అధికారులు బుధవారం సాయంత్రం నుంచి రాకపోకలను నిలిపివేశారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లవలసిన వాహనాలను అచ్చంపేట మండలంలోని హాజీపూర్ నుంచి వంగూరు మండలం చింతపల్లి, కొండారెడ్డిపల్లి మీదుగా మళ్లించారు. కోతకు గురైన జాతీయ రహదారిని నాగర్ కర్నూలు ఎస్పీ పరిశీలించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు అధికారులు సమాచారం అందించారు.
Cyclone Montha
Telangana rains
Heavy rainfall alert
Nagar Kurnool
National Highway damage

More Telugu News