Pakistan Hockey: ఒకటి తలిస్తే మరొకటి జరిగింది... జూనియర్ హాకీ వరల్డ్ కప్ లో పాక్ స్థానం ఒమన్ తో భర్తీ

Pakistan Hockey Team Replaced by Oman in Junior Hockey World Cup
  • తమిళనాడులో జరగనున్న జూనియర్ హాకీ ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్ వైదొలగింది
  • పాక్ స్థానంలో టోర్నీలో పాల్గొననున్న ఒమన్ జట్టు
  • నవంబర్ 28 నుంచి చెన్నై, మధురైలో ఈ టోర్నీ నిర్వహణ
  • భారత్, చిలీ, స్విట్జర్లాండ్‌లతో కూడిన గ్రూప్-బిలో చేరనున్న ఒమన్
  • భారత్‌లో టోర్నీ నుంచి పాక్ తప్పుకోవడం ఇది రెండోసారి
పాకిస్థాన్ ఒకటి తలిస్తే... మరొకటి జరిగింది. భారత్ ఆతిథ్యమిస్తున్న జూనియర్ హాకీ వరల్డ్ కప్ లో తాము ఆడబోమని, తటస్ఠ వేదికపై అయితేనే ఆడతామని చెప్పింది. అయితే, అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్ణయం మరోలా ఉంది. పాక్ స్థానంలో ఒమన్ జట్టును వరల్డ్ కప్ కు ఎంపిక చేసింది.

అసలేం జరిగిందంటే... భారత్ ఆతిథ్యమిస్తున్న హాకీ జూనియర్ ప్రపంచకప్‌ 2025 నుంచి పాకిస్థాన్ చివరి నిమిషంలో వైదొలగింది. దీంతో ఆ జట్టు స్థానంలో ఒమన్‌కు అవకాశం లభించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) అధికారికంగా ప్రకటించింది. ఈ టోర్నమెంట్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు తమిళనాడులోని చెన్నై, మధురై నగరాల్లో జరగనుంది.

జూనియర్ ఆసియా కప్ 2024లో ప్రదర్శన ఆధారంగా పాకిస్థాన్ ఈ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. అయితే, టోర్నీలో పాల్గొనేందుకు తాము పంపిన ఆహ్వానాన్ని పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ అంగీకరించలేదని, ఈ మేరకు తమకు సమాచారం అందించిందని FIH ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఆసియా కప్‌లో తర్వాతి ఉత్తమ ర్యాంకులో ఉన్న ఒమన్‌కు ఈ అవకాశం దక్కింది.

ఈ టోర్నీలో భారత్, చిలీ, స్విట్జర్లాండ్‌లతో పాటు పాకిస్థాన్ గ్రూప్-బిలో ఉంది. ఇప్పుడు పాక్ స్థానంలో ఒమన్ ఈ గ్రూప్‌లో చేరనుంది. పాకిస్థాన్ నిర్ణయం కోసం అంతర్జాతీయ హాకీ సమాఖ్య దాదాపు నెల రోజుల పాటు టోర్నీ డ్రాను వాయిదా వేసింది. తమ ప్రభుత్వంతో సంప్రదింపుల కోసం పాక్‌కు సమయం ఇచ్చినా, చివరికి వారు తప్పుకోవడంతో స్విట్జర్లాండ్‌లోని లూసాన్‌లోని తమ ప్రధాన కార్యాలయంలోనే డ్రాను పూర్తి చేయాల్సి వచ్చింది.

భారత్‌లో జరిగే టోర్నీ నుంచి పాకిస్థాన్ వైదొలగడం ఇది రెండోసారి. ఇంతకుముందు బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన పురుషుల ఆసియా కప్ నుంచి కూడా తప్పుకోగా, వారి స్థానంలో బంగ్లాదేశ్ ఆడింది. ఆ టోర్నీ ప్రపంచకప్‌కు క్వాలిఫయింగ్ ఈవెంట్ కావడంతో పాకిస్థాన్ ఆ అవకాశాన్ని కోల్పోయింది.

కాగా, 2025 నుంచి పురుషుల, మహిళల జూనియర్ హాకీ ప్రపంచకప్‌లలో 24 జట్లతో నిర్వహించాలని FIH నిర్ణయించింది. మరిన్ని దేశాలకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఈ మార్పు చేశారు. 2023లో కౌలాలంపూర్‌లో జరిగిన గత ఎడిషన్‌లో జర్మనీ విజేతగా నిలిచింది.
Pakistan Hockey
Junior Hockey World Cup
Oman Hockey
FIH
Chennai
Madhurai
Junior Asia Cup
Hockey Tournament
India Hockey

More Telugu News