Chandrababu: మొంథా తుపాన్ అనంతర చర్యలు వేగవంతం చేయండి: సీఎం చంద్రబాబు

Chandrababu Focuses on Post Cyclone Relief Measures
  • మొంథా తుపాన్‌పై అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
  • బాధితులకు వెంటనే నిత్యావసరాలు అందించాలని ఆదేశం
  • నష్టం అంచనాలను త్వరగా సిద్ధం చేయాలని సూచన
  • టీమ్‌వర్క్‌తో నష్ట నివారణ సాధ్యమైందన్న ముఖ్యమంత్రి
  • సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు వేగంగా పనిచేయాలని పిలుపు
  • తుపాన్ కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు వెల్లడి
మొంథా తుపాన్ అనంతర సహాయక, పునరుద్ధరణ చర్యలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు తక్షణమే నిత్యావసర సరుకులు అందించాలని, సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు యుద్ధప్రాతిపదికన పనిచేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "గత నాలుగైదు రోజులుగా మొంథా తుఫాన్‌ను ఎదుర్కోవడంలో అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది వరకు అంతా ఒక బృందంగా పనిచేసి నష్ట నివారణకు కృషి చేశారు. ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు" అని తెలిపారు. మరో రెండు రోజులు ఇదే స్ఫూర్తితో పనిచేస్తే బాధితులకు మరింత ఊరట లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు, అధికారులు పర్యటించి, ప్రభుత్వ సహాయక చర్యల గురించి ప్రజలకు వివరించాలని, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోవాలని సూచించారు. మొంథా తుపాన్‌ వల్ల జరిగిన నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే నష్ట తీవ్రతను చాలా వరకు తగ్గించగలిగామని సీఎం అభిప్రాయపడ్డారు.

"ఈసారి సచివాలయాలపై మైక్ అనౌన్స్‌మెంట్ సిస్టం ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేశాం. ఇది ఒక నూతన విధానం. మున్సిపాలిటీల్లో డ్రైన్లు శుభ్రం చేయడం వల్ల కాలనీలు ముంపునకు గురికాలేదు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు 10 వేల మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచాం" అని వివరించారు. ఈ తుపాన్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మరణించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటేనే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందని, మన చర్యలతో ప్రజల్లో భరోసా పెరిగిందని చంద్రబాబు అన్నారు.
Chandrababu
Montha Cyclone
Andhra Pradesh
Cyclone Relief
Disaster Management
AP Government
Cyclone Aftermath
Emergency Response
Natural Disaster
CM Chandrababu

More Telugu News